రానురాను సమాజం ఆధునిక పోకడలవైపు మళ్లుతున్నప్పటికీ జనం మాత్రం స్వామీజీల వలలో పడడం మానడం లేదు. దీనివల్ల దొంగ స్వామీజీలకు అడ్డు అదుపు లేకుండానే పోతోంది. తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలో ఓ వ్యక్తి స్వామీజీ అవతారం ఎత్తి భక్తులను తన వలలో వేసుకోవడం మొదలు పెట్టాడు. తాను మానవ రూపంలో ఉన్న శ్రీనివాసుడ్ని అని, తన చుట్టూ తిరిగితే మీ కష్టాలు ఇట్టే మాయం అవుతాయని ప్రచారం చేసుకున్నాడు. తానే పరమాత్ముడ్ని, అవతారపురుషుడ్ని అంటూ డప్పు కొట్టుకున్నాడు. ఏకంగా శేషతల్పంపై పడుకొని, ఇద్దరు ఆడవాళ్లతో కాళ్లు నొక్కించుకుంటున్న ఫోటోలను సైతం బయటకు వదిలాడు.
ఈ వ్యక్తి హల్ చల్ చేయడంతో ఆయన పిలుపు అందుకున్న భక్తులు కుప్పలు తెప్పలుగా ఆయన ఆశ్రమం ముందు క్యూ కట్టేశారు. దీంతో అక్కడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా అయ్యాయి. తమిళనాడుకు చెందిన రంగనాథం అనే వ్యక్తి తాను దేవుడ్ని అంటూ ప్రచారం చేసుకుంటున్నాడు. రోగం ఏదైనా సరే వెంటనే నయం చేసేస్తాను అంటూ ప్రచారం చేసుకుంటూ మహబూబ్ నగర్ లో సెటిల్ అయ్యాడు.
జిల్లాలోని కేటీదొడ్డి మండలం కొండాపురం స్టేజ్ దగ్గర స్థావరం ఏర్పాటు చేసుకున్నాడు. సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం ఎత్తి, శేషతల్పంపై నిద్రిస్తూ ఇద్దరు లక్ష్మీలు (భార్యలు) ఆయన కాళ్లు నొక్కుతున్నట్లుగా ఫోటోలను వదిలాడు. దీంతో ప్రజల చూపును తనవైపునకు తిప్పుకున్నాడు. ఆయన నివసించే ప్రదేశంలో భక్తుల రద్దీ బాగా పెరిగిపోయి ట్రాఫిక్‌కు బాగా అంతరాయం ఏర్పడింది. దీంతో స్వామీజీని మరో ప్రాంతానికి పోలీసులు తరలించారు. చివరకు, పోలీసులు ఆ దొంగ బాబా గుట్టును రట్టు చేశారు. ఈ దొంగ బాబాకు గతంలోనే కౌన్సెలింగ్ ఇచ్చామని స్థానిక ప్రజలకు వివరించారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial