‘కాంతార’ మూవీతో మరోసారి దక్షిణాది చిత్రాల సత్తా చాటిన దర్శకుడు రిషబ్ శెట్టి. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ.. భారీ వసూళ్లతో బాక్సాఫీసును బద్దలకొట్టింది. అప్పటి నుంచి ఈ మూవీ దర్శకుడు, మీరో రిషబ్ శెట్టిపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. అంతేకాదు, ‘కాంతార’కి సీక్వెల్ కూడా రూపొందించాలంటూ సినీ ప్రేక్షకులు కోరుతున్నారు. అయితే, రిషబ్.. సీక్వెల్‌కు బదులు ప్రీక్వెల్ తెరకెక్కించేందుకు సన్నహాలు చేస్తున్నట్లు ఇటీవల వెల్లడించారు.
‘ది మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్’ అవార్డు అందుకోనున్న రిషబ్
తాజాగా రిషబ్‌కు అరుదైన గౌరవం లభించింది. ఈ నెల 20న ముంబయిలో తాజ్ ల్యాండ్ ఎండ్ హోటల్‌లో జరగనున్న ‘దాదా సాహేబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్-2023’లో రిషబ్ ‘ది మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్’ అవార్డును అందుకోనున్నారు. సెంట్రల్ సెన్సార్ బోర్డ్ సభ్యుడు, దాదాసాహేబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సీఈవో అభిషేక్ మిశ్రా బుధవారం ఈ విషయాన్ని వెల్లడించారు.
కన్నడ నుంచి మూడో వ్యక్తి
దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఏటా ఉత్తమ నటీనటులు, సాంకేతిక నిపుణులు తదితరులకు ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. కన్నడ నటులకు ఈ అవార్డు లభించడం ఇదే తొలిసారి కాదు. 2019లో ‘కేజీఎఫ్-చాప్టర్ 1’ మూవీకి గాను యష్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నాడు. 2020లో ‘దబాంగ్ 3’లో నటనకు గాను కన్నడ నటుడు కిచ్చా సుదీప్ మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ విభాగంలో అవార్డును అందుకున్నాడు. ఆ తర్వాత కరోనా వల్ల రెండేళ్లుగా ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగడం లేదు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 20న జరిగే వేడుకను మరింత ఘనంగా నిర్వహించే ఆలోచనలో ఉన్నారు.
ప్రధాని మోడీతో రిషబ్ డిన్నర్
రిషబ్ ఇటీవల బెంగళూరులోని రాజ్‌భవన్‌లో ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి డిన్నర్ చేసే ఛాన్సు కొట్టేశారు. ఈ సందర్భంగా రిషబ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘దేశంలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాని మోదీతో పంచుకున్నాం. సినీ ఇండస్ట్రీకి చెందిన కొన్ని డిమాండ్లను కూడా ప్రధాని నోట్ చేసుకున్నారు. మన సంస్కృతికి ప్రాతినిధ్యం వహించే ‘కాంతారా’ మూవీని తీసినందుకు మమ్మల్ని అభినందించారు’’ అని తెలిపారు.
ప్రీక్వెల్ మూవీలో ఏం ఉండబోతోందంటే?
ఇక ‘కాంతార’ ప్రీక్వెల్‌లో గ్రామస్తుల మధ్య అనుబంధాలు, గుళిగ దైవం, రాజు గురించి చూపిస్తామని నిర్మాత విజయ్ కిరంగదూర్ అన్నారు. గ్రామస్తులతో పాటు భూమిని రక్షించడానికి రాజు ఏం చేశాడనేది తెర మీద చూపించనున్నట్లు చెప్పారు. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల కోసం వర్షాధారిత వాతావరణం అవసరమన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
‘కాంతార’ సినిమా తొలుత కన్నడలో విడుదలైంది. అనంతరం సంచలన విజయం సాధించడంతో తెలుగు, తమిళం, మలయాళం, హిందీలోకి మేకర్స్ డబ్ చేసి విడుదల చేశారు. ఈ మూవీ విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ రికార్డులు దద్దరిల్లాయి. ఐఎమ్‌డీబీలో అత్యధిక రేటింగ్‌ను సాధించిన సినిమాగా ‘కాంతార’ నిలిచింది. మరి ‘కాంతారా’ ప్రీక్వెల్ ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలి.