ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమలో పాల్గొన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, చంద్రబాబుపై, ఎన్టీఆర్ ఫ్యామిలీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొసలి, పాము లాంటి కన్ను ఆర్పని భయంకరమైన మూడో ప్రాణిని తాను చూశానని ఆయనే చంద్రబాబు నాయుడు అన్నారు. అల్లుడిగా ఉంటూ టార్చర్ చేసి ఎన్టీఆర్ ను చంపేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్టీఆర్ ను చంపిన వాళ్లే, చేతికి ఉన్న రక్తాన్ని తుడుచుకుని వచ్చి, ఇప్పుడు అభిషేకాలు చేస్తున్నారంటే దుయ్యబట్టారు.
చరిత్ర చింపేస్తే చిరిగిపోదు, చంపిన వాళ్లే అభిషేకాలు చేస్తున్నారు!
“నేను వేదిక మీదున్న పెద్దలను కలవడానికి రాలేదు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొనడానికి రాలేదు. కేవలం ఒక జోక్ చెప్పడానికి వచ్చాను. ఆ జోక్ చాలా సీరియస్ జోక్. ఎవరూ నవ్వలేని ఆ జోక్ రాజమండ్రిలో జరుగుతోంది. నాకు తెలిసి స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ కూడా నవ్వాలో, ఏడ్వాలో తెలియని జోక్. చరిత్రలో వెన్నుపోటు అనేది జూలియస్ సీజర్ ను బ్రూటస్ పొడవడంతో మొదలవుతుంది. వాళ్లిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ లేదు. కేవలం నమ్మకం మాత్రమే ఉంది. కానీ, ఇక్కడ ఇంటి అల్లుడై ఉండి, టార్చర్ చేసి, ఏడిపించి ఏడిపించి చంపిన తర్వాత, మళ్లీ ఆయనే ఎన్టీఆర్ కు దండవేసి, ఇంతకంటే గొప్పవాడు లేడని చెప్పడం అనేది పెద్దజోక్. ఎన్టీఆర్ విషయంలో సీబీఐ విచారణ, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుల రీసెర్చ్ అవసరం లేదు. చంద్రబాబు ఎలాంటి వాడు అనేది ఎన్టీఆరే చెప్పారు. ‘ముత్యాల ముగ్గు’ అనే సినిమాలో చరిత్ర చింపేస్తే చిరిగిపోదు, చెరిపేస్తే చెరిగిపోదు అనే డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ నాకు అర్థం కాలేదు అప్పట్లో వాళ్లే చంపి, రక్తం తుచుకుని వచ్చి అభిషేకాలు చేయడం అనేది సీరియస్ జోక్” అన్నారు.
రజనీకాంత్ కూడా వెన్నుపోటు పొడిచినట్లే!
“ఒకవేళ సీబీఎన్ బ్యాచ్ అనుకుంటున్నట్లు లక్ష్మీపార్వతి మాయలో ఎన్టీఆర్ పడ్డారు అనుకుంటే, ఆయనకు బుర్రలేదు అనుకోవాలా? ఒకవేళ బుర్రలేకుండా అలాంటి పని చేసి ఉంటే, ఇంకా ఆయనను ఎందుకు పూజిస్తున్నారు? ఎందుకు ఫోటోలు పెడుతున్నారు? దండలు వేస్తున్నారు? మీరు అన్న మాట మీదనైనా నిలబడాలి కదా? మీరు చెప్పే మాట మీద కూడా నిలబడ్డం లేదు. రజనీకాంత్ అనే వారు సూపర్ స్టార్. ఆయనను సూపర్ స్టార్ చేసింది ఎన్టీఆర్. అలాంటి వ్యక్తి వచ్చి, ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి పక్కనే కూర్చొని ఆయనను పొగడటం అంటే రజనీకాంత్ కూడా ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడవటమే అవుతుంది” అన్నారు ఆర్జీవీ.
ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఉన్న ఒకేఒక్క మగాడు జూ. ఎన్టీఆర్
“నందమూరి తారక రామారావు ఫ్యామిలీలో ఉన్న ఒకేఒక్క మగాడు తారక్. ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యామిలీ లోని ఏ ఒక్కరిని ముందుకు రాకుండా చేసి చంద్రబాబు ఒక్కడే ముందు కనిపిస్తాడు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు జూ. ఎన్టీఆర్ ఎందుకు రాలేకపోయానో చెప్పినా, తన తాత మీద ఉన్న విపరీతమైన గౌరవం తోనే వారితో స్టేజి మీద కనిపించకూడదనే రాలేదు అనుకుంటున్నాను. అందుకు తారక్ కు హృదయపూర్వకంగా అభినందిస్తున్నా ఎన్టీఆర్ అభిమానిగా. మొసలి, పాము లాంటి భయంకరమైన కన్ను ఆర్పని మూడో జీవిని నేను చూశాను. ఆయనే చంద్రబాబు నాయుడు. త్వరలో నేను తీయబోయే ‘వ్యూహం’ సినిమాలో తొలిసారి చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ ను అరటిపండు ఒలిచి పెట్టినట్లు పెడతాను. మీరు ఆ తియ్యదనాన్ని ఆస్వాదించండి” అన్నారు రామ్ గోపాల్ వర్మ.
Read Also: నిజమైన కథ అని రాస్తే సరిపోదు, నిజం ఉండాలి - ‘ది కేరళ స్టోరీ’పై కమల్ హాసన్ కామెంట్స్