ఎన్నో నిరసనలు, ఆందోళనల నడుమ విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. కనీవినీ ఎరుగని రీతిలో కలెక్షన్లు వసూలు చేస్తోంది. మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ది కేరళ స్టోరీ’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. సుదీప్తోసేన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి విపుల్ అమృత్ లాల్ షా నిర్మాతగా వ్యవహరించారు. విడుదలకు ముందు నుంచే పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. తాజాగా ఈ చిత్రం వసూళ్ల విషయంలో కొత్త రికార్డును సాధించింది. ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించి లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా నిలిచింది.
ప్రచారం కోసం తీసే సినిమాలను నేను వ్యతిరేకం
తాజాగా ‘ది కేరళ స్టోరీ’ చిత్రంపై నటుడు కమల్ హాసన్ స్పందించారు. ఓ చానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. కేవలం ప్రచారం కోసం తీసే సినిమాలకు తాను వ్యతిరేకం అని చెప్పుకొచ్చారు. “నేను మీకు ఇప్పటికే చెప్పాను. నేను ప్రచారం కోసం తీసే చిత్రాలకు వ్యతిరేకం. సినిమా టైటిల్ కింద ఇది నిజమైన కథ అని రాశారు. కానీ, నిజం అనే రాస్తే సరిపోదు. నిజంగా నిజం ఉండాలి. ఈ సినిమాలో చూపించే నిజం నిజం కాదు” అని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు.
వసూళ్ల పరంగా సంచలనం సృష్టించిన ‘ది కేరళ స్టోరీ’
‘ది కేరళ స్టోరీ’ చిత్రం వసూళ్ల విషయంలో కొత్త రికార్డును సాధించింది. ఇప్పటికే రూ. 200 కోట్లు వసూలు చేసి సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతోంది. ఇప్పటి వరకు కంగనా రనౌత్, అలియా భట్, విద్యాబాలన్ నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలకు ఉన్నాయి. ప్రస్తుతం వీరి చిత్రాలను అధిగమించి ముందుకు దూసుకెళ్తోంది ఆదా శర్మ ‘ది కేరళ స్టోరీ’ మూవీ. బాలీవుడ్ చరిత్రలోనే అత్యధికంగా ఓపెనింగ్ పొందిన లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా నిలిచింది. అదా శర్మ, యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో మహిళలే కీలక పాత్రలు పోషించారు.
అద్భుత విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు
ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సృష్టిస్తున్న సంచలనం పట్ల నటి ఆదా శర్మ సంతోషం వ్యక్తం చేసింది. "తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో విడుదల కాకాపోయినా, దేశంలో రూ. 200 కోట్ల నికర వసూళ్లను సాధించిన మొదటి మహిళా చిత్రంగా నిలిచింది. జీవితంలో అత్యుత్తమ విషయాలు ఊహించనివి. అంచనాలకు మించి ఈ సినిమా రాణిస్తోంది. ఈ సినిమా ఈ రేంజిలో విజయం అందుకోవడం పట్ల సంతోషంగా ఉంది. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు” అని చెప్పుకొచ్చింది.
Read Also: రెండో పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే? అసలు విషయం చెప్పిన ఆశిష్ విద్యార్థి!