ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్‌ ఆదివారం నాడు కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. రాజ్ కోటి ద్వయంగా ఫేమస్ అయ్యారు. రాజ్ కోటి కలిసి చేసిన ఎన్నో సినిమాలు, వాటిలోని పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్‌గానే ఉంటాయి. ఇక తన ప్రాణ స్నేహితుడు, సోదర సమానుడు అయిన రాజ్‌ మరణించిన వార్త తెలుసుకున్న కోటి కన్నీరు పెట్టేసుకున్నారు. 


సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ.. 'నేను ప్రస్తుతం చెన్నైలో ఉన్నాను. కాసేపటి క్రితమే ఈ వార్త విన్నాను. నా రాజ్ చనిపోయారనే వార్తను జీర్ణించుకోలేకపోతోన్నాను. మొన్నీ మధ్యే ఓ సినిమా ఫంక్షన్‌లో కలుసుకున్నాం. ఆరోగ్య సమస్యలున్నట్టుగా నాకు అనిపించలేదు. రాజ్ కూడా చెప్పలేదు. ఈ రోజు ఉదయం హార్ట్ ఎటాక్‌తో ఆయన మరణించారని తెలిసి ఎంతో బాధగా ఉంది. రాజ్ కోటిగా మేం ఇద్దరం ఎన్నో సినిమాలకు కలిసి పని చేశాం.’


‘ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాం. మేం ఇద్దరం విడిపోయిన తరువాత కోటిగా నేను ఎన్ని సినిమాలు చేసినా.. వాటిని కూడా రాజ్ కోటి పాటలు అనేవారు. మేం ఇద్దరం ఇరవై నాలుగు గంటలూ పని చేసేవాళ్లం. చక్రవర్తి దగ్గర మేం ఇద్దరం అసిస్టెంట్లుగా పని చేశాం. ముఠామేస్త్రి, హలోబ్రదర్స్ ఇలా ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాం. మేం ఇద్దరం తెలుగులో ఓ ట్రెండ్‌ను సృష్టించాం. ఈ రోజు నా రాజ్ లేడంటూ ఎంతో బాధగా ఉంది. మా పాటల రూపంలో నా రాజ్ కలకాలం ఉంటాడు.’


‘కాల ప్రభావం, పరిస్థితుల వల్ల మేం విడిపోయాం.  నేను ఎన్ని సినిమాలు చేసినా కూడా రాజ్ నా పక్కన ఉన్నాడనే ధైర్యంతోనే చేయగలిగాను. రాజ్‌కి నేను ఒక తమ్ముడిలాంటి వాడిని. చిన్ననాటి స్నేహితులం. మేం ఇద్దరం విడిపోవడం నాకు ఇప్పటికీ బాధగానే ఉంటుంది. వద్దురా విడిపోవద్దు అని అన్నాడు. కానీ అప్పటి పరిస్థితుల వల్ల విడిపోయాం. మా పాటల రూపంలో రాజ్‌ ఎప్పటికీ బతికే ఉంటాడు' అని అన్నారు.


రాజ్ మరణంపై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. ట్విట్టర్ ద్వారా రాజ్‌కు నివాళులు అర్పించారు. తాను ఎన్నో సినిమాలకు చక్కని సంగీతాన్ని అందించిన రాజ్‌ ఇక లేరనే విషయం తనని దీగ్భ్రాంతికి గురిచేసిందని చిరంజీవి అన్నారు. 


‘ప్రముఖ సంగీత దర్శక ద్వయం రాజ్-కోటి లలో 'రాజ్' ఇక లేరు అని తెలవటం  దిగ్భ్రాంతికి  గురి చేసింది. ఎంతో ప్రతిభ వున్న రాజ్, నా కెరీర్ తొలి దశలలో నా  చిత్రాలకందించిన ఎన్నో అద్భుత ప్రజాదరణ పొందిన బాణీలు, నా చిత్రాల విజయాలలో ముఖ్య పాత్ర వహించాయి. నన్ను  ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి. రాజ్ అకాల ప్రస్థానం సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆయన అభిమానులకి, కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సంతాపం. ఓం శాంతి’ అని చిరంజీవి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 


Also Read: ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ ఇక లేరు, బాత్రూమ్‌లో జారి.. 


తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పటికీ గుర్తుండిపోయే సంగీత ద్వయం ‘రాజ్-కోటి’. తన స్నేహితుడు కోటితో కలిసి ఎన్నో సినిమాలకు మంచి స్వరాలు అందించిన రాజ్(65).. ఆదివారం మరణించారు. బాత్రూమ్‌లో కాలు జారడం వల్ల ఆయన గుండె పోటుకు గురయ్యారని, హాస్పిటల్‌కు తరలించే లోపే ఆయన కన్ను మూశారని రాజ్ కుటుంబ సభ్యులు తెలిపారు. రాజ్ మరణ వార్త యావత్ టాలీవుడ్‌ను విషాదంలో నింపేసింది. 


Also Read: ‘స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా’ అన్న రాజ్-కోటీలు ఎందుకు విడిపోయారు?