Microsoft CMO: 


మైక్రోసాఫ్ట్ సీఎమ్‌వో సూచన..


ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్‌ల ట్రెండ్ నడుస్తున్న క్రమంలో మైక్రోసాఫ్ట్ ఇటీవలే సంచలన ప్రకటన చేసింది. ఉద్యోగులెవరూ శాలరీ హైక్‌లు ఎక్స్‌పెక్ట్ చేయొద్దని తేల్చి చెప్పింది. జీతాలు పెంచే పరిస్థితులు లేవని స్పష్టం చేసింది. దీనిపై మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కొందరైతే సోషల్ మీడియాలో పోస్ట్‌లు కూడా పెట్టారు. "చెంప దెబ్బ కొట్టినట్టు ఉంది" అని  గట్టిగానే విమర్శించారు. ఈ విమర్శలపై మైక్రోసాఫ్ట్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ (CMO) క్రిష్టోఫర్ స్పందించారు. జీతాలు పెంచుకునే చిట్కా కూడా చెప్పారు. ఓ అంతర్జాతీయ సమావేశంలో పాల్గొన్న ఆయన...అందరి ఎంప్లాయిస్‌ని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులందరూ కలిసి కంపెనీ స్టాక్‌ ప్రైస్‌ పెంచేలా చేయగలిగితే చాలని, ఆటోమెటిక్‌గా జీతాలు పెరుగుతాయని అన్నారు. 


"ఉద్యోగులందరూ జీతాలు పెంచడం లేదని అంటున్నారు. కానీ...నా దగ్గర ఓ చిట్కా ఉంది. అది పాటిస్తే మీ అందరి జీతాలు పెరుగుతాయ్. ఏమీ లేదు. మీరు బాగా కష్టపడి మన కంపెనీ స్టాక్‌ ప్రైస్‌ని పెంచండి చాలు. క్వార్టర్‌లీ రిజల్ట్స్‌ బాగా వస్తే ఆటోమెటిక్‌గా మీ సీటీసీ పెరుగుతుంది. దానిపై దృష్టి పెట్టండి"


- క్రిష్టోఫర్, మైక్రోసాఫ్ట్ సీఎమ్‌వో


అయితే...ఈ ఏడాది మైక్రోసాఫ్ట్‌ స్టాక్‌ ప్రైస్‌ గతంలో కన్నా పెరిగింది. దాదాపు 33% పెరిగినట్టు రిపోర్ట్‌లు చెబుతున్నాయి. ఈ ఏడాది హైక్‌లు ఉండవని ఉద్యోగులకు తేల్చి చెప్పింది కంపెనీ. బోనస్‌లు, స్టాక్‌ అవార్డులకు సంబంధించిన బడ్జెట్‌లోనూ కోత విధిస్తున్నట్టు ప్రకటించింది. సీఈవో సత్య నాదెళ్ల ఈ మేరకు అందరికీ మెయిల్స్ పంపినట్టు తెలుస్తోంది. అయితే..దీనిపై ఇప్పటి వరకూ అధికారికంగా ఆ సంస్థ స్పందించలేదు. Reuters రిపోర్ట్ ప్రకారం మాత్రం సత్య నాదెళ్ల పేరుతో ఉద్యోగులందరికీ మెయిల్స్ అందాయి. 


"గతేడాది మార్కెట్ కండీషన్స్‌ని తట్టుకునేందుకు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సి వచ్చింది. కంపెనీ పెర్‌ఫార్మెన్స్‌ని పెంచేందుకూ ఖర్చు చేశాం. గ్లోబల్ మెరిట్ బడ్జెట్‌కి రెండింతలు ఖర్చు పెట్టాం. కానీ ఈ సారి ఆర్థిక పరిస్థితులు ఏ మాత్రం బాలేవు. చాలా విభాగాల్లో సమస్యలున్నాయి. అందుకే...ఈ సారి హైక్‌లు క్యాన్సిల్ చేస్తున్నాం. బోనస్‌లలోనూ కోత పడే అవకాశాలున్నాయి"


- ఉద్యోగులకు సీఈవో సత్యనాదెళ్ల మెయిల్ (Reuters రిపోర్ట్ ప్రకారం)


ఈ ఏడాది జనవరిలో మైక్రోసాఫ్ట్ సంచలన ప్రకటన చేసింది. త్వరలోనే 10 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు వెల్లడించింది. HR సహా ఇంజినీరింగ్ విభాగంలో వేలాది మందిని తొలగించేందుకు సిద్ధమవు తున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది. మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 5% మేర ఉద్యోగులను తొలగించనుంది. ఇప్పటికే అమెజాన్, మెటా భారీ సంఖ్యలో లేఆఫ్‌లు కొనసాగిస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో కుదుపుల కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఉగ్యోగులను తొలగించక తప్పడం లేదని చెబుతున్నాయి టెక్‌ సంస్థలు. మైక్రోసాఫ్ట్ సంస్థ...దాదాపు 11 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్నట్టు తెలుస్తోంది. Reuters న్యూస్ ఏజెన్సీ కూడా ఇదే విషయం వెల్లడించింది. 


Also Read: రూ.2 వేల నోట్లు మార్చుకునేందుకు ఐడీ ప్రూఫ్ అవసరం లేదు, SBI కీలక ప్రకటన