ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న తాజా సినిమా 'పొన్నియిన్ సెల్వన్'. చారిత్రాత్మక నేపథ్యంతో తెరకెక్కిన సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కల్కి కృష్ణమూర్తి రచించిన 'పొన్నియన్ సెల్వన్' నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. తొలి భాగం సెప్టెంబర్ 30న విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా కొనసాగుతున్నాయి.


చియాన్ విక్రమ్ ఆదిత్య కరికాలుడిగా, జయం రవి అరుణ్ మొళి వర్మగా, ఇంకా కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష, జయరాం, ప్రకాష్ రాజ్, పార్తిబన్ ఇలా భారీ స్టార్ కాస్ట్ ఈ సినిమా సొంతం. ఇప్పుడున్న ప్యాన్ ఇండియా ట్రెండ్ కు మణిరత్నం సత్తా ఏంటో చాటే మంచి అవకాశంగా సినీ విశ్లేషకులు 'పొన్నియిన్ సెల్వన్'ను భావిస్తున్నారు. అయితే తమిళంలో ఈ సినిమాకి ఉన్న హైప్.. మిగిలిన భాషల్లో లేదు. 


'బాహుబలి' తరహాలో ఈ సినిమా దేశవ్యాప్తంగా యుఫోరియా క్రియేట్ చేస్తుందని చిత్రబృందం ఆశిస్తోంది కానీ తమిళనాడు అవతల ప్రేక్షకుల్లో మాత్రం సినిమాపై ఆసక్తి అంతంతమాత్రంగానే ఉంది. కానీ అమెరికాలో ఈ సినిమాకి భారీ క్రేజ్ కనిపిస్తుండడం విశేషం. అమెరికా ప్రీమియర్స్ కోసం వారం ముందే అక్కడ పెద్ద ఎత్తున టికెట్లు అమ్ముడవుతున్నాయి. రిలీజ్ కి ఐదు రోజుల ముందే ఈ సినిమా హాఫ్ మిలియన్ డాలర్ల మార్కుని అందుకుంది. 


గత మూడు రోజుల్లో ప్రీసేల్స్ బాగా పుంజుకున్నాయి. అయితే చాలా వరకు తమిళ వెర్షన్ కోసమే బుకింగ్స్ జరిగినట్లు తెలుస్తోంది. తెలుగు, హిందీ వెర్షన్స్ కి అక్కడ కూడా పెద్దగా హైప్ లేదు. దీన్ని బట్టి తమిళ జనాలు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారని అర్ధమవుతోంది. ప్రీమియర్స్ కి ముందే సినిమా మిలియన్ మార్క్ ను టచ్ చేస్తుందని.. ప్రీమియర్స్ పూర్తయ్యేసరికి 1.5 మిలియన్ మార్కుని అందుకున్న ఆశ్చర్యం లేదని అంటున్నారు. తమిళనాడులో కూడా ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టడం ఖాయమని తెలుస్తోంది. 


'ఓకే బంగారం' తర్వాత దర్శకుడు మణిరత్నానికి ఆ స్థాయి హిట్ లేదనే చెప్పాలి. 'విలన్', 'నవాబ్', 'చెలియా' చిత్రాలు మంచి పేరే తెచ్చుకున్నా... ఆ సినిమాలు కేవలం తమిళనాడుకే పరిమితమయ్యాయి. సో... ఇప్పుడు మణిరత్నానికి ఓ భారీ రేంజ్ హిట్ కావాలి. 1980, 90లలోనే శంకర్, మణిరత్నం ప్యాన్ ఇండియా సినిమాలు తీయటం మొదలు పెట్టినా ఇప్పుడున్నంత ఆడియన్స్ ఎంగేజ్ మెంట్, స్కోప్ కానీ అప్పుడు లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. బాలీవుడ్ ఆడియన్స్ మొత్తం సౌత్ నుంచి ఎలాంటి సినిమాలు వస్తున్నాయా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వస్తున్న ఈ సినిమా పాటలు ఇప్పటికే సినిమా గ్రాండియర్ ను కళ్లకు కడుతున్నాయి. ట్రైలర్ ఈ అంచనాలను మరింత పెంచేసింది. ఇప్పుడు ఈ సినిమా కూడా హిట్ అయితే బాలీవుడ్ ను శాసించిన సౌత్ సినిమాల జాబితాలో మరో భారీ సినిమా చేరినట్లువుతుంది.


Also Read : 'ఆదిపురుష్' ట్రెండ్ సెట్టర్ - నేను ప్రభాస్ వీరాభిమాని : సోనాల్ చౌహన్ ఇంటర్వ్యూ


Also Read : ప్లూటు బాబు ముందు ఊదు, జ‌గ‌నన్న ముందు కాదు - బాలకృష్ణకు మంత్రి రోజా కౌంటర్