మాస్ మహారాజా రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దర్శకుడు శరత్ మండవ రూపొందించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చేలా ఉంది ఈ సినిమా. ఈ సినిమాకి సరైన బజ్ రాకపోవడంతో నిర్మాతలు సొంతంగా రిలీజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు సినిమా డిజాస్టర్ అవ్వడంతో నిర్మాతల పరిస్థితి దారుణంగా తయారైంది. 


దీంతో రవితేజ తన రెమ్యునరేషన్ లో కొంత మొత్తాన్ని తిరిగిస్తున్నట్లు వార్తలొచ్చాయి. నిర్మాత సుధాకర్ చెరుకూరితో పాటు ఈ సినిమా నిర్మాణంలో రవితేజ కూడా భాగమయ్యారు. కానీ మేజర్ ప్రొడక్షన్ మొత్తం సుధాకర్ చెరుకూరినే చూసుకున్నారు. ఇప్పుడు నష్టం కూడా ఆయనదే. దీంతో రవితేజ కొంత మొత్తాన్ని సుధాకర్ చెరుకూరికి ఇస్తున్నట్లు ప్రచారం జరిగింది. 


అయితే ఇందులో నిజం లేదని తెలుస్తోంది. రవితేజ తన రెమ్యునరేషన్ తిరిగిస్తానని చెప్పలేదట. దానికి బదులుగా సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో మరో సినిమా చేస్తానని మాటిచ్చారట. ప్రస్తుతం దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అన్నీ కుదిరితే '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' చిత్ర దర్శకుడు మున్నా ఈ సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం రవితేజ 'రావణాసుర', 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ సినిమాలు ఓ కొలిక్కి వస్తే.. సుధాకర్ చెరుకూరితో మరో సినిమా ఉంటుంది. 


Also Read: తెలుగులో హీరోలు లేరా? మలయాళం నుంచి రావాలా? - దుల్కర్‌పై సంతోష్ శోభన్ షాకింగ్ కామెంట్స్


Also Read: మళ్ళీ నిఖిల్‌ను వెనక్కి పంపారు - ఆగస్టు 12న కాదు, తర్వాత రోజున 'కార్తికేయ 2'