బీభత్సమైన సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా, సోలో హీరోగా రాలేకపోతున్నాడు సుశాంత్. ఇప్పటికే పలు సినిమాల్లో హీరోగా నటించినా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయాడు. ఆయన కెరీర్ లో ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క సాలిడ్ హిట్ కూడా పడలేదు. ఈ నేపథ్యంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే ‘అల వైకుంఠపురంలో’ సినిమాలో కీలక పాత్ర చేసి ఫర్వాలేదు అనిపించాడు. ప్రస్తుతం ‘రావణాసుర’ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.
సుశాంత్ కు ‘రావణాసుర’ టీమ్ అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్
‘ధమాకా’ లాంటి సూపర్ హిట్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ హీరోగా ‘రావణాసుర’ సినిమా తెరకెక్కుతోంది. దర్శకుడు సుధీర్ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రవితేజ్ నుంచి రాబోతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కావడంతో ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో సుశాంత్ అదిరిపోయే క్యారెక్టర్ చేబోతున్నారు. ఏప్రిల్ 7, 2023న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. సుశాంత్ బర్త్ డే కావడంతో తాజాగా గ్లింప్స్ విడుదల చేసింది సినిమా యూనిట్. ఇందులో సుశాంత్ పాత్రను పరిచయం చేసింది.
అంచనాలు పెంచేసిన ‘రావణాసుర’ టీజర్
ఇక ఇప్పటికే విడుదలైన ‘రావణాసుర’ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఈ టీజర్ కట్ రిలీజ్ చేశారు. ఇందులో వరుస హత్యలకు కారణమైన ఓ పవర్ ఫుల్ క్రిమినల్ లాయర్‌గా రవితేజ దర్శనం ఇస్తాడు. అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటు ఆకట్టుకునే విజువల్స్ తో టీజర్ వారెవ్వా అనిపించేలా ఉంది. ఈ టీజర్ సుశాంత్ విలన్‌గా కనిపించాడు. సుశాంత్ లుక్, స్టైల్ చాలా కొత్తగా అనిపించింది. ఈ టీజర్ సినిమాపై అంచనాలను బాగా పెంచింది. “సీతను తీసుకువెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు, రావణుడిని కూడా గెలవాలి” అని రవితేజ చెప్పిన డైలాగ్ హైలెట్ గా నిలిచింది.
అలరించనున్న ఐదుగురు ముద్దుగుమ్మలు
ఇక ఈ సినిమాలో రవితేజ హీరోగా చేస్తుండగా, అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, దివ్యాంశ కౌశిక్, పూజిత పొన్నాడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా కీరోల్స్ చేస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, RT టీమ్‌వర్క్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. హర్షవర్దన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.
‘భోళా శంకర్’లో సుశాంత్ కీలక పాత్ర
అటు మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబోలో రూపొందుతున్న ‘భోళా శంకర్’ చిత్రంలో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. సుశాంత్ పుట్టిన రోజు సందర్భంగా అతని ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థతో కలసి అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఇందులో చిరు సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మెగాస్టార్ చెల్లెలు క్యారెక్టర్ లో కీర్తి సురేష్ యాక్ట్ చేస్తోంది.
Read Also: ఉగాది కానుకగా థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలివే!