టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఆమె మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం తెలియగానే ఆమె అభిమానులు ఆందోళనకు గురయ్యారు. సామ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇండస్ట్రీ నుంచి కూడా పలువురు సెలబ్రెటీలు సమంతకు ధైర్యం చెబుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. ఇప్పటికే ఈ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటోంది సమంత. తాజాగా నటి సమంత ఆరోగ్యం గురించి హీరోయిన్ రష్మిక మందన్న స్పందించింది. ఇటీవల ఆమె నటించిన ‘వారసుడు’ సినిమా  ప్రమోషన్స్‌లో భాగంగా సమంతపై ప్రశంసల వర్షం కురిపించింది రష్మిక. 


సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతుందని ఆమె ప్రకటించే వరకూ.. ఆ విషయం తనకు కూడా తెలియదని రష్మిక చెప్పింది. అంతక ముందు కూడా తమ మధ్య దాని ప్రస్తావన ఏమీ రాలేదని పేర్కొంది. సమంత అద్భుతమైన మహిళ. ఆమె ఎంతో దయ కలిగిన, అందమైన వ్యక్తి అని చెప్పుకొచ్చింది రష్మిక. ఇలాంటి పరిస్థితుల్లోనే ఒక అమ్మలా మారి సమంతను కాపాడుకోవాలనిపిస్తుందని అంది. ఆమెకు ధైర్యం చెప్పేందుకు తోడుగా నిలబడాలనుకుంటున్నానని చెప్పింది. సమంత తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొందని, అలాంటి వ్యక్తి నుంచి ఎంతో మంది స్పూర్తి పొందుతారని, తాను కూడా సమంత నుంచి చాలా నేర్చుకున్నానని తెలిపింది. తాను ఎంతగానో ఇష్టపడే వ్యక్తులలో సమంత ఒకరని చెప్పింది. సమంతకు ఇకపై అన్నీ మంచే జరగాలని కోరుకుంటున్నానని అంది రష్మిక. 


ఇక వీరి సినిమాల విషయానికొస్తే.. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించగా.. సమంత అదే సినిమాలో ఐటెమ్ సాంగ్ లో కనిపించింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడవంతో పాటు పాటలు కూడా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఇక సమంత గతేడాది ‘యశోద’ అనే లేడి ఓరియెంటెడ్ సినిమా చేసింది. ఈ సినిమాకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ మూవీలో చేస్తుండగానే సమంతకు మయోసైటిస్ వ్యాధి వచ్చినట్లు తెలిసింది. అయితే, అనుకున్న టైమ్‌కు ఆ మూవీని రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో సమంత ఆ వ్యాధికి చికిత్స తీసుకుంటూనే మూవీకి డబ్బింగ్ చెప్పింది. ఈ సినిమా అన్ని విధాలుగా హిట్ టాక్ తెచ్చుకుంది. డిజిటల్ ఫ్లాట్ ఫామ్ పై కూడా ‘యశోద’ సినిమా మంచి వ్యూస్ రాబట్టింది.


అలాగే రష్మిక కూడా ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తోంది. తెలుగు, తమిళం, కన్నడతో పాటు గతేడాది హిందీలో కూడా అడుగు పెట్టింది. అయితే ఆమె హిందీలో చేసిన సినిమాలు అంతగా హిట్ సాధించలేకపోయాయి. అయితే ఆమె హిందీలో రీసెంట్ గా నటించిన ‘మిషన్ మజ్ను’ సినిమాను కూడా ఓటీటీ లోనే విడుదల చేయనుండటం కూడా మైనస్ గా మారింది. ఇక అమ్మడి ఆశలన్నీ రణబీర్ కపూర్ తో కలసి నటిస్తోన్న ‘యానిమల్’ సినిమాపైనే పెట్టుకుంది. ఈ మూవీకు ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇక తమిళంలో విజయ్ తో కలసి నటించిన సినిమా ‘వారిసు’ సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. ఈ మూవీను తెలుగులో ‘వారసుడు’ గా విడుదల చేస్తున్నారు.




Read Also: ఇండియాపై పాక్ కుట్ర - ఆ హీరోయిన్లతో హనీ ట్రాపింగ్, నటి సజల్ అలీ పాత్రేంటి?