TS Congress : టీపీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శిక్షణా తరగతులకు హాజరు కావాలని అసంతృప్తితో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఫోన్ చేశారు. అయితే సీనియర్ నేతలు పార్టీ అధ్యక్షుడు ఫోన్ చేసినా లైట్ తీసుకున్నారు. ఒక్క మల్లు భట్టి విక్రమార్క మాత్రమే శిక్షణా తరగతులకు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి గాంధీ ఐడియాలజీ కేంద్రంలో ఈ కార్యక్రమం జరగుతోంది. అందరూ ఏకతాటిపైకి ఉన్నారన్న సందేశం ఇవ్వడానికైనా సీనియర్లు హాజరు కావాలని ఖర్గే ఆశించారు. అందుకే ఫోన్ చేసి చెప్పారు. అయితే ఖర్గేనూ .., భట్టి విక్రమార్క తప్ప ఇతర సీనియర్లు పట్టించుకోలేదు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి సహా సీనియర్లు ఇతర ప్రాంతాల్లో ఉన్నందున శిక్షణకు హాజరు కాలేకపోతున్నామన్న సమాచారాన్ని పంపినట్లుగా తెలుస్తోంది. అయితే ఇది ఓ సాకుగానే భావిస్తున్నారు. అయితే అసమ్మతి నేతలు ఇటీవలి కాలంలో పెద్దగా వ్యతిరేక ప్రకటనలు చేయడం లేదు. గతంలో నిర్ణయం తీసుకున్నట్లుగా టీ పీసీసీ చేపడుతున్న కార్యక్రమాల్లో మాత్రం పాల్గొనడం లేదు. టీ.పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పట్ల అసమ్మతి పెరిగిపోయి తాడో పేడో తేల్చుకునేందుకు సీనియర్లు సిద్ధమవుతున్న తరుణంలోనే దిగ్విజయ్ సింగ్ రంగ ప్రవేశం చేశారు. సీనియర్లతో పలు అంశాలు చర్చించారు. ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడారు. పార్టీలో అందరూ సమానమేనని చెప్పారు.
పార్టీలో ఎప్పుడు జరిగే తంతునే సీనియర్లకు దిగ్విజయ్ గుర్తుచేశారని అంటున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలని సూచించారు. అన్యాయం జరుగుతోందని భావించిన పక్షంలో అధిష్టానం దృష్టికి తీసుకురావచ్చని అందుకు తాజా జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సహా ఢిల్లీ నేతలంతా అందుబాటులో ఉంటారని ఆయన హామీ ఇచ్చారు. ప్రతీ విషయానికి మీడియా కెమెరాల ముందుకు వెళితే వాళ్లే పలుచనైపోతారని దిగ్విజయ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో అందరూ ఐక్యంగా పనిచేయాలని అప్పుడే గెలుస్తామని పార్టీ నాయకులను మీడియా ముందు కాదు ప్రజల పక్షాన రోడ్డెక్కి పోరాడమని హితబోధ చేశారు.
ఒక పక్క దిగ్విజయ్ చర్చలు జరపగా మరో పక్క అధ్యక్షుడు ఖర్గే సహా పలువురు నేతలు సీనియర్లకు టచ్ లోకి వచ్చారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ కూడా ఒక్కరిద్దరు నేతలతో ఫోన్లో మాట్లాడి పార్టీ పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరారు. ఇప్పటికే తెలంగాణలోనూ జాతీయ స్థాయిలోనూ వరుసగా రెండు సార్లు ఓడిపోయామని మరోసారి ఓటమి పాలైతే అందరికీ ఇబ్బందేనని వివరించారు. సంఘీభావమే బలమన్నది మరిచిపోకూడదని అగ్రనేతలు హితబోధ చేశారు. ఫైనల్ గా మరో మాట కూడా చెప్పినట్లు తెలుస్తోంది. ఇంత చేసినా సీనియర్లు ఇంకా పూర్తి స్థాయిలో కుదురుకోలేకపోయారు. టీ కాంగ్రెస్ లో ఈ వ్యవహారం ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.