కన్నడ బ్యూటీ రష్మిక మందన్న గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘ఛలో‘ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ, ప్రస్తుతం సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. తెలుగుతో పాటు, తమిళ్, మలయాళం సినిమాల్లో నటిస్తోంది. బాలీవుడ్ లోనూ సత్తా చాటుతోంది. వరుస హిట్లతో ఫుల్ జోష్ లో ఉన్న రష్మిక మందన్న గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ‘పుష్ప’ సినిమా హిట్ తర్వాత ఏకంగా 5 నగరాల్లో 5 లగ్జరీ ఫ్లాట్లు కొనుగోలు చేసిందనేది ఆ వార్త సారాంశం. రష్మిక తన సంపాదనలో ఎక్కువగా ఆస్తుల మీదే పెట్టుబడులు పెడుతోందట. అందులో భాగంగానే గత కొద్ది కాలంలోనే దేశ వ్యాప్తంగా 5 ప్రధాన నగరాల్లో 5 విలాసవంతమైన ఫ్లాట్లు కొన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్, గోవా, ముంబై, కూర్గ్, బెంగుళూరులో ఈ అపార్ట్ మెంట్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఆ వార్తలు నిజమైతే బాగుంటుంది-రష్మిక
తాజాగా ఈ వార్తలపై రష్మిక మందన్న స్పందించింది. ఇదంతా నిజం కావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించింది. “ఇలాంటి రూమర్స్ ఎవరు పుట్టిస్తారో తెలియదు. కానీ, అన్నీ నిజమైతే ఎంత బాగుంటుందో” అంటూ కామెంట్ చేసింది.
గత కొద్ది కాలంగా వివాదాల్లో రష్మిక
గత కొద్ది కాలంగా రష్మిక మందన్న పలు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తోంది. ‘మిషన్ మజ్ను’ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా కాంట్రవర్శియల్ కామెంట్స్ చేసింది. రొమాంటిక్ సాంగ్స్ ను రూపొందించడంలో బాలీవుడ్ బెస్ట్ అని చెప్పింది. ఆమె వ్యాఖ్యలపై సౌత్ లో విమర్శలు వెల్లువెత్తాయి. “తెలుగు, తమిళ సినిమాల్లో నటించేటప్పుడు కన్నడ సినిమా గురించి తక్కువ చేసి మాట్లాడావు. ఇప్పుడు బాలీవుడ్ సినిమాలు చేస్తూ, సౌత్ ఇండస్ట్రీని తక్కువ చేస్తున్నావ్” అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు ఈ వ్యాఖ్యలపై రష్మిక వివరణ ఇచ్చింది.”నేను అలా అనలేదు. నేను చెప్పబోయే లోపే డిస్ట్రబ్ అయ్యాను. అందుకే మాటలు తడబడ్డాను. సోషల్ మీడియాలో తనపై విపరీతంగా నెగిటివిటీ ఉంది” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
వరుస సినిమాలతో ఫుల్ బిజీ
తాజాగా ‘మిషన్ మజ్ను’, ‘సీతారామం’ సినిమాల్లో నటించిన రష్మి, ప్రస్తుతం ‘పుష్ప-2’లో నటిస్తోంది. తొలి భాగంలో శ్రీవల్లిగా అలరించిన రష్మిక, రెండో భాగంలో మరింత గ్లామరస్ పాత్ర పోషించబోతోందట. ప్రస్తుతం బాలీవుడ్ లో ‘యానిమల్’ అనే మూవీలో నటిస్తోంది.
ఆకట్టుకుంటున్న కొటేషన్
తాజాగా ఈ కన్నడ బ్యూటీ సోషల్ మీడియాలో కొటేషన్స్ షేర్ చేస్తోంది. "అందరూ సంతోషంగా ఉండండి. ఆశతో జీవించండి. సంతోషం, శాంతి జీవితంలో అన్నిటికంటే చాలా గొప్పవి. ప్రతికూల భావాలను వదిలేయాలి. ఎందుకంటే జీవితం చాలా చిన్నది" అని తాజాగా వెల్లడించింది.
Read Also: నా భర్తకు గతంలోనే పెళ్లైంది, విడాకులకు కారణం నేను కాదు: హన్సిక