Animal OTT Release: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరో, హీరోయిన్లు గా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'యానిమల్'. సందీప్ రెండ్డి వంగా తెరకెక్కించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం బాక్సాఫీస్ దగ్గర రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తండ్రి-కొడుకు మధ్య సెంటిమెంట్ బేస్ చేసుకుని రూపొందించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల మీద తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ, వసూళ్ల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి విడుదల అవుతుందా? అని ఆశగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈ సినిమా ఓటీటీ రైట్స్ దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్ట్రీమింగ్ కు తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ, తాజాగా ఓటీటీలో ఈ మూవీ విడుదలకు సంబంధించి న్యాయస్థానం సమన్లు జారీ చేసింది.
‘యానిమల్’ మూవీకి ఓటీటీ రిలీజ్ కష్టాలు
‘యానిమల్’ సినిమాను టి-సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడియోస్కలిసి నిర్మించాయి. తాజాగా ‘యానిమల్’ సినిమా ఓటీటీ విడుదలను నిలిపివేయాలంటూ సినీ1 స్టూడియోస్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మూవీ శాటిలైట్ రైట్స్ విషయంలో సూపర్ క్యాసెట్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, క్లూవర్ మ్యాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలతో ఒప్పందం జరిగిందని, అయితే, వారి నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా తనకు అందలేదని వెల్లడించింది. తనకు రావాల్సిన వాటా వచ్చేంత వరకు ఈ సినిమా ఓటీటీ విడుదలను నిలిపివేయాలని కోర్టును కోరింది. ఈ నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్ తో పాటు చిత్ర నిర్మాణ సంస్థలకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. ఈ అంశంపై ఇవాళ (జనవరి 20)లోగా వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. జనవరి 22న ఈ వివాదంపై విచారణ జరపనున్నట్లు వెల్లడించింది.
ఓటీటీలో ఆ సీన్లు ఉండబోతున్నట్లు వెల్లడించిన దర్శకుడు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ నిడివి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘యానిమల్’ రన్ టైమ్ మూడున్నర గంటలు ఉండటంతో ఆడియెన్స్ ఇబ్బంది పడతారని 9 నిమిషాల సన్నివేశాలను కట్ చేసినట్లు చెప్పారు. ఓటీటీలో మాత్రం ఆ సన్నివేశాలను యాడ్ చేస్తున్నట్లు తెలిపారు. అంటేకాదు, థియేటర్ కోసం తొలగించిన కొన్ని షాట్లను కూడా ఓటీటీ వెర్షన్‌కు యాడ్ చేస్తున్నట్లు వివరించారు. ఇందులో రష్మికతో రణబీర్ లిప్‌లాక్ సీన్స్ కూడా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
‘యానిమల్’ మూవీలో బాబీ డియోల్ విలన్‌గా కనిపించగా, రణబీర్ కపూర్ తండ్రిగా అనిల్ కపూర్ నటించాడు. త్రిప్తి దిమ్రీ మరో కీలకపాత్రలో కనిపించింది. ఈ మూవీకి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందించారు. టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌తో కలిసి సందీప్ వంగా సోదరుడు ప్రణయ్ వంగా ఈ మూవీని నిర్మించాడు. ‘యానిమల్’ మూవీ తర్వాత ప్రభాస్‌తో ‘స్పిరిట్’ మూవీ చేయబోతున్నాడు సందీప్ వంగా.
Read Also: రష్మికతో ఎంగేజ్‌మెంట్, విజయ్ దేవరకొండ అంతమాట అనేశాడేంటి?