పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సత్య పాత్రలో యువ కథానాయకుడు, ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన సినిమా 'ది వారియర్'. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రామ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
లింగుస్వామి కథ చెప్పడానికి వచ్చేముందు వరకు అది పోలీస్ కథ అని తెలియదని.. ఫార్మాలిటీ కోసం వినేసి ఆ తర్వాత వద్దని చెబుదామనుకున్నానని.. కానీ 'ది వారియర్'లో ఆ సోల్, ఎమోషన్ బాగా నచ్చిందని.. కథ చెప్పేటప్పుడు అందులో జెన్యూన్ ఎమోషన్ నాకు కనిపించిందని చెప్పారు. ఈ కథ ఎంత ఎగ్జైట్ చేసిందంటే... లింగుస్వామి గారు నేరేషన్ ఇచ్చి వెళ్లిపోయిన సాయంత్రానికి పోలీస్ యూనిఫామ్ ఇంటికి తెప్పించానని వెల్లడించారు రామ్.
మోకాలికి గాయమైనా షూటింగ్ చేసిన విషయంపై రామ్ ని ప్రశ్నించగా.. 'ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ కోసం గాయమైనా షూటింగ్ చేయాలని నాకు అనిపించింది. చేస్తున్నాను. సెట్‌కు వెళ్లిన తర్వాత కెమెరా చూస్తే కెమెరా లెన్స్ కనిపించదు. పదికోట్ల మంది కనిపిస్తారు. నా కోసం థియేటర్లకు వచ్చి చూస్తున్నారంటే.. నేను చేయగలననే ఫీలింగ్ వస్తే 100 పర్సెంట్ చేయాల్సిందే' అంటూ చెప్పుకొచ్చారు. ఇక తన తదుపరి సినిమాలు ఎవరితో ఎప్పుడు ఉంటుందనేది ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుందని.. 'ది వారియర్' విడుదల తర్వాత బోయపాటి శ్రీను గారి సినిమా స్టార్ట్ చేస్తున్నట్లు చెప్పారు.