రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన హైవోల్టేజీ యాక్షన్ డ్రామా ‘స్కంద’. థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా నవంబర్ 2వ తేదీ నుంచి డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఓటీటీలో విడుదల అయ్యాక ఈ సినిమాపై కొన్ని ట్రోల్స్ వచ్చాయి. వీటిలో ప్రముఖమైనది క్లైమ్యాక్స్ యాక్షన్ సీన్లో ఒక షాట్‌లో రామ్‌కు డూప్‌గా బోయపాటి శ్రీను కనిపించడం. దీనిపై హీరో రామ్ పోతినేని క్లారిటీ ఇచ్చారు. ఎక్స్/ట్విట్టర్‌లో దీనిపై వివరణ ఇస్తూ పోస్టు పెట్టారు.


ఈ పోస్టులో ‘22.04.2023... ఆరోజు నాకు చాలా గుర్తుంది. వేసవి కాలం పీక్‌లో ఉన్నప్పుడు అత్యంత వేడిగా ఉన్న రోజుల్లో అది కూడా ఒకటి. 25 రోజుల క్లైమ్యాక్స్ షూట్‌లో మూడో రోజు అయ్యే సరికి నా అరికాలి పరిస్థితి ఇది (కాలి ఫొటో కూడా షేర్ చేశారు).  సరిగ్గా నడవడం కూడా నా వల్ల కాలేదు. కొంచెం అలా పక్కకి వెళ్లి వచ్చేసరికి అరి కాలి నుంచి రక్తం వస్తుంది. ఆ షాట్ ఎలాగైనా సరిగ్గా తీయాలనుకున్న నా డైరెక్టర్ తనే డైరెక్టుగా దిగి షూట్ చేశారు. కంటెంట్ నచ్చుతుందా లేదా అన్నది ఆడియన్స్ ఛాయిస్. నేను వారి అభిప్రాయాలకు విలువ ఇచ్చాను. ఇకపై కూడా ఇస్తాను. ఎందుకంటే ఇదంతా మీకోసమే. కానీ ఈ షాట్‌ను నా కోసం చేసిన నా దర్శకుడికి ధన్యవాదాలు చెబుతున్నాను. #Skanda’. అని పోస్టు చేశారు.


దాని కింద మళ్లీ ‘మీ దగ్గరకు వచ్చిన ప్రతిసారీ నేను ప్రాణం పెట్టి పని చేస్తూనే ఉంటారు. అలాగే మీ నుంచి ఏదీ ఆశించను.’ అని రాశారు. ఈ పోస్టుపై నెటిజన్లు పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతున్నారు. నీ హార్డ్ వర్క్ వృథా అవ్వదంటూ రామ్‌కు సక్సెస్ రావాలని కోరుకుంటున్నారు.






ఈ మూవీ ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. నవంబర్ 2వ తేదీ నుంచి 'స్కంద' డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం లో ఈ మూవీ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది. 'స్కంద'ని బోయపాటి తనదైన మార్క్ ఫుల్ యాక్షన్ మూవీగా తెరకెక్కించారు.


ఈ చిత్రంలో బోయపాటి మార్కు భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయి. ఊర మాస్ లుక్‌లో రామ్ పోతినేని అదరగొట్టేసాడు. దానికి తోడు ఈ మూవీలో రామ్ పోతినేని డ్యూయల్ రోల్‌లో కూడా నటించి మెప్పించాడు. రామ్ ఇప్పటివరకు తన కెరీర్‌లో రెండు సార్లు మాత్రమే డబుల్ రోల్ చేశాడు. 2021లో వచ్చిన ‘రెడ్’లో మొదటి రామ్ ద్విపాత్రాభినయం చేసి మెప్పించాడు.