పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా, ఆయన బ్లాక్ బస్టర్ సినిమాలను పలు థియేటర్లలో రీరిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్ అభిమానులు థియేటర్లకు పోటెత్తారు. థియేటర్ల ముందు బాణాసంచా కాల్చి సందడి చేశారు. ప్రభాస్ బర్త్ డేను కోలాహలంగా జరుపుకున్నారు. కొన్నిచోట్ల ప్రభాస్ అభిమానులు చేసిన పిచ్చి పనులు తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇదేం తిక్క పని అంటూ సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతుంది.


ప.గో జిల్లాలో ప్రభాస్ ఫ్యాన్స్ అత్యుత్సాహం


ప్రభాస్ బర్త్ డే సందర్భంగా  పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని వెంకట్రామ థియేటర్‌లో ప్రభాస్ మూవీ బిల్లాను 4k లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా అభిమానులు థియేటర్ లోపల బాణాసంచా కాల్చారు. అది కాస్తా అగ్ని ప్రమాదానికి కారణం అయ్యింది. థియేటర్ లోని సీట్లకు మంటలు అంటుకున్నాయి. దీంతో ప్రేక్షకులంతా ప్రాణ భయంతో థియేటర్ బయటకు పరిగెత్తారు. థియేటర్ యాజమాన్యం, కొందరు అభిమానులు వెంటనే ఆ మంటలను ఆర్పివేశారు. కానీ అప్పటికే పొగ థియేటర్ మొత్తం వ్యాపించింది.


ప్రభాస్ ఫ్యాన్స్ పై ఆర్జీవీ ఆగ్రహం


ఈ ఘటనపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రభాస్ అభిమానులపై నిప్పులు చెరిగారు. థియేటర్లో బాణాసంచా కాల్చడానికి సంబంధించిన వీడియోలను ఆయన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. అభిమానులు తీరుపై మండిపడ్డారు “ ఇక్కడ దీపావళి వేడుక జరగడం లేదు. ప్రభాస్ సినిమాను ప్రదర్శిస్తుండగా బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకుంటున్నారు. ఇది ప్రభాస్ అభిమానుల మ్యాడ్ నెస్ కు నిదర్శనం. ఆయన ఫ్యాన్స్ జరుపుకున్న దీపావళి పండుగ స్టైల్ ఇది” అంటూ ట్వీట్ చేశారు.  అయితే, ఈ ఘటనపై ఫ్యాన్స్ వెర్షన్ మరోలా ఉంది.  షో మధ్యలో నిలిపివేసినందుకే ఇలా చేసినట్లు వెల్లడించారు. ఏది ఏమైనా ప్రభాస్ అభిమానుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.