Vishakapatnam CP Srikanth: ఇటీవల విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో ఏపీ మంత్రులపై పక్కా ప్లాన్‌ ప్రకారమే దాడి జరిగిందని పోలీస్ ​కమిషనర్ శ్రీకాంత్ అన్నారు. అయితే పోలీసులపై జనసేన నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు. అక్టోబర్ 15న విశాఖలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై ఆ పార్టీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మీడియాకు తెలిపారు. విశాఖ ఎయిర్​పోర్టు వద్ద జనసేన నేతలు ఏపీ మంత్రులపై ప్రణాళిక ప్రకారమే దాడి చేసినట్లు విచారణలో తెలిందని, ఈ కేసులో పూర్తిగా దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. 


పవన్ పర్యటనకు మాత్రమే అనుమతి 
ఏపీ మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేశ్ లతో పాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై ముందస్తు ప్లాన్‌తోనే దాడి చేశారని అన్నారు. ఈ క్రమంలో మంత్రి రోజా పీఏ దిలీప్ కు, ఇన్స్‌పెక్టర్ నాగేశ్వరరావులకు గాయాలు అయ్యాయని శ్రీకాంత్ వెల్లడించారు. దాడికి పాల్పడిన నిందితులను ఇదివరకే అరెస్ట్ చేసి జైలుకు తరలించామని సీపీ చెప్పారు. పవన్ కళ్యాణ్ పట్ల పోలీసులు ఎక్కడా దురుసుగా ప్రవర్తించలేదని, కేవలం ఆయనకు విశాఖ పర్యటనకు మాత్రమే అనుమతి ఉందని క్లారిటీ ఇచ్చారు. ర్యాలీ, డీజే, పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించడం, డ్రోన్ల వినియోగానికి సంబంధించి జనసేన నేతలకు ఎలాంటి అనుమతి లేదన్నారు. కానీ అక్టోబర్ 15న అనుమతి లేకుండా పవన్ ర్యాలీ చేశారని చెప్పారు. పోలీసులపై జనసేన నేతల ఆరోపణలు అవాస్తవమని, విశాఖ ఎయిర్‌పోర్ట్ దగ్గర ప్లాన్ ప్రకారమే మంత్రులపై దాడి జరిగిందని సీపీ వెల్లడించారు. దాడి ఘటనలో దాదాపు 100 మందిపై కేసులు నమోదు చేశామని సీపీ శ్రీకాంత్ చెప్పారు.


పవన్ ర్యాలీ కారణంగా ఎన్నో ఇబ్బందులు 
అనుమతి లేకున్నా పవన్ కల్యాణ్ ర్యాలీ నిర్వహించిన కారణంగా 30 మంది ప్రయాణికులు తమ వెళ్లాల్సిన విమానాన్ని అందుకోలేకపోయారని, ట్రాఫిక్ వల్ల అత్యవసర సేవలకూ, ప్రజలకు ఇబ్బంది కలిగిందని వైజాగ్ సీపీ తెలిపారు. పవన్ కల్యాణ్ పట్ల పోలీసులు ఎక్కడా దురుసుగా ప్రవర్తించలేదనీ, ర్యాలీకి అనుమతి లేదని చేసిన ప్రయత్నాలను సైతం అపార్థం చేసుకున్నారని చెప్పారు. పవన్ ర్యాలీ వల్ల ఎమర్జెన్సీ సర్వీసులతో పాటు ఎయిర్‌పోర్ట్ ప్రయాణికులు  ఇబ్బంది పాలయ్యారు  జనసేన నేతల దాడిలో పెందుర్తి సీఐ గాయపడ్డారని, ప్రభుత్వ ఆస్తులు కూడా ధ్వంసం అయ్యాయని వెల్లడించారు. ఈ   ఘటనపై 6 వేర్వేరు కేసులు నమోదు చేశామని, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నట్లు వివరించారు.


విశాఖ విమానాశ్రయంలో దాడి కేసులో జనసేన నేతలకు ఊరట లభించింది. అరెస్ట్ అయిన జనసేన నేతలు, కార్యకర్తలు శనివారం జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసులో తొలుత 70 మందిని అరెస్ట్ చేయగా.. 61 మంది జనసేన నాయకులు, కార్యకర్తలను రూ.10 వేల పూచీకత్తుపై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మిగిలిన 9 మంది జనసేన నేతలపై మాత్రం తీవ్ర స్థాయి అభియోగాలతో కేసులు నమోదు చేశారు పోలీసులు. దీంతో కోర్టు వీరికి ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. జనసేన న్యాయ పోరాటం చేయడంతో శుక్రవారం ఈ 9 మందికి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. విశాఖ కేంద్ర కార్యాలయం నుంచి జనసేన నేతలు విడుదలయ్యారు.