ఆహారం మన ఆరోగ్యంపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. మనం తినే ఆహారాన్ని బట్టి శరీరంలో ఎన్నో మార్పులు కలుగుతాయి. ఆధునిక కాలంలో ఎన్నో జంటలు పిల్లలు కలుగక ఇబ్బంది పడుతున్నారు. ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. నిజానికి వారు తాము తినే ఆహారం గురించి కాకుండా మిగతా అన్ని టెస్టులు చేయించుకుంటారు. కానీ ఇప్పుడు ఆహారం కూడా గర్భం ధరించకుండా అడ్డుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా ఎవరైతే సోడాలు, కార్బోనేటెడ్ డ్రింకులు (కూల్ డ్రింకులు) అధికంగా తాగుతారో వారికి సంతానోత్పత్తి సమస్యలు వచ్చే అవకాశం అధికంగా ఉంది. పురుషులు, స్త్రీలు ఇద్దరిపై ఈ ప్రభావం పడుతుంది.
దీనివల్లే ప్రమాదం
అస్పర్టమే అనేది ఒక కృత్రిమ స్వీటెనర్. ఇది ఎండోక్రైన్ గ్రంధుల పనులకు అంతరాయం కలిగిస్తుంది. దీనివల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. హార్మోన్ల అసమతుల్యత వస్తే మహిళలకు చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గర్భం దాల్చలేరు. ఎందుకంటే దీని వల్ల అండోత్సర్గము కాకపోవడం, పీఎమ్ఎస్ (ప్రీ మెన్‌స్ట్రవల్ సిండ్రోమ్) వంటి సమస్యలు వస్తాయి. వీటి వల్ల గర్భం దాల్చలేకపోవడం, దాల్చినా కూడా గర్భస్రావం కావడం వంటివి జరుగుతాయి.
ఫెనిలాలనైన్, అస్పార్టిక్ యాసిడ్ అనేవి అస్పర్టమేలో ఉన్న రెండు అమైనో ఆమ్లాలు. సోడాలు, కూల్ డ్రింకులలో అస్పర్టమే అధికంగా ఉంటుంది.వేరే ఆహారంతో కలిపి కాకుండా వాటొక్కటినే తాగడం వల్ల శరీరంలో కణాల మరణానికి కారణమవుతాయి. ఎందుకంటే అవి ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. వీటివల్ల మగవారిలో వీర్యకణాలు చనిపోవడం, మహిళల్లో అయితే అండాశయ కణాలు మరణించడం జరుగుతుంది. దీని వల్ల కూడా గర్భం ధరించడం చాలా కష్టతరమైపోతుంది.
చాలా శీతల పానీయాలలో కెఫిన్ అధికంగా ఉంటుంది. అలాగే ఫ్రక్టోజ్ కలిగి ఉంటుంది. ఇవి రెండూ మహిళల్లో గర్భం ధరించకుండా అడ్డుకుంటాయి. కెఫీన్ గర్భాశయ రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది అలాగే ఋతు రక్తస్రావం తగ్గించడం ద్వారా రుతుచక్రాన్ని అడ్డుకుంటుంది. కెఫీన్, అస్పర్టమే, ఫ్రక్టోజ్ కలిసి హార్మోన్ గ్రాహకాలను, సెక్స్ హార్మోన్లను ప్రభావితం చేస్తాయి. వీటి వల్ల కూడా సంతానోత్పత్తి సమస్యలు వస్తాయి.
కాబట్టి, మీరు గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సోడాలు, కూల్ డ్రింకులు, కృత్రిమ స్వీటెనర్లు నిండిన ఆహారాలకు దూరంగా ఉండాలి. మంచి పోషకాహారం తినాలి.
Also read: రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారిలో కూడా కనిపించే కోవిడ్ లక్షణాలు ఇవి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.