Pawan Kalyan: రోడ్డు మీద వాంతి చేసుకుంటే బాబాయ్ క్లీన్ చేశారు - చరణ్ ఫోన్‌కాల్‌లో పవన్ గురించి ఏం అన్నారు?

అన్‌స్టాపబుల్ టాక్ షోలో పవన్ కళ్యాణ్‌తో తన బాండింగ్ గురించి రామ్ చరణ్ ఫోన్ కాల్ ద్వారా తెలిపారు.

Continues below advertisement

Ram Charan: అన్‌స్టాపబుల్ షోలో ప్రభాస్ ఎపిసోడ్ తరహాలో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌లో కూడా రామ్ చరణ్ కాల్ ద్వారా కనెక్ట్ అయ్యారు. ఈ కాల్‌లో పవన్ కళ్యాణ్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి చెప్పారు. మొదట రామ్ చరణ్‌కు పవన్ కళ్యాణ్ కాల్ చేయగా వెంటనే బాలకృష్ణ ఫోన్ తీసేసుకున్నారు.

Continues below advertisement

‘హలో చరణ్... దీర్ఘాయుష్మాన్‌భవ. ఏమయ్యా ఫిటింగ్ మాస్టరూ. నువ్వు ఫిటింగ్ మాస్టర్‌వేనయ్యా. నీకు ఫోన్ చేసి ప్రభాస్ గురించి ఏమైనా చెప్పమంటే నీ గుడ్ న్యూస్ (తండ్రి కాబోతున్న సంగతి) మింగేసి ప్రభాస్ గుడ్ న్యూస్ చెప్పావ్.’ అని బాలకృష్ణ గానే రామ్ చరణ్ ‘కొద్ది రోజుల్లో నా గుడ్‌న్యూస్ గురించి వచ్చింది.’ అన్నారు. వెంటనే బాలకృష్ణ ‘కంగ్రాట్యులేషన్స్... గాడ్ బ్లెస్ యూ.’ అని దీవించారు.

ఆ తర్వాత ‘నేను ఒక్క విషయం అడగడానికి ఫోన్ చేశాను. మీ బాబాయ్ గురించి ఎవ్వరికీ తెలియని విషయం ఒకటి చెప్పాలి.’ అని బాలయ్య అడిగారు. దానికి చరణ్ ‘ఏం ఉంటదండీ. ఆయన లైఫ్‌ చాలా బోరింగ్. సీక్రెట్లు ఏమీ ఉండవండీ. హైదరాబాదీ బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఏడు రోజులు అదే తినమన్నా తింటారు.’ అన్నారు.

‘చిన్నప్పటి నుంచి చరణ్ నా దగ్గరే పెరిగాడని పవన్ అన్నాడు. నిజమేనా?’ అని బాలకృష్ణ అడిగారు. ‘అవునండీ. 100 పర్సెంట్ అది. మా అమ్మ కంటే బాబాయ్ దగ్గరే ఎక్కువ పెరిగాం.’ అని చరణ్ సమాధానం ఇచ్చాడు. ‘ఇప్పుడు మీరిద్దరూ కలిసి నాన్నకు తెలియకుండా చేసిన అల్లరి పని చెప్పు.’ అని చరణ్‌ని బాలకృష్ణ అడిగారు. వెంటనే పవన్ పక్కనుంచి ‘సింగపూర్ వెళ్లినప్పుడు నిన్ను ఎలా చూశానో చెప్పు.’ అని హింట్ ఇచ్చి సైలెంట్ అయ్యారు.

‘అప్పట్లో నేను ఆయనకు నరకం చూపించాను. అమ్మ లేరు కదా అని రోడ్డు మీద ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్ అన్నీ తిని అక్కడే వాంతి చేసుకున్నాను. పాపం అది ఆయనే క్లీన్ చేసి నన్ను హోటల్ తీసుకెళ్లారు. ఆయన సింగపూర్ ట్రిప్‌ని నేను నాశనం చేశాను.’ అని చరణ్ అన్నారు. ‘అప్పుడు నీ వయసెంతమ్మా’ అని బాలకృష్ణ అడగ్గా... పవన్ కళ్యాణ్ ‘నాలుగు, ఐదు సంవత్సరాలు అనుకుంటా.’ అన్నారు.

‘ఐదేళ్ల పిల్లాడిని చంకలో పెట్టుకుని వెళ్లడం ఏంటమ్మా.’ అని బాలకృష్ణ సరదాగా అన్నారు. ‘నిన్ను అడిగిన విషయం చెప్పలేదు. నాన్నకి తెలియకుండా నువ్వు, బాబాయ్ చేసిన అల్లరి పని ఏంటి?’ అని మళ్లీ అడిగితే చరణ్ ‘నన్ను భరించలేకపోతే మా నాన్న అప్పుడు బాబాయ్ దగ్గరికి పంపేవాళ్లు. ఆయన నాతో గంటలు గంటలు మాట్లాడే వాళ్లు. ఆయన చెప్పినవి ఒక 10 రోజులు అలా ఫాలో అయ్యే వాడిని. తర్వాత మళ్లీ మామూలే.’ అన్నారు.

ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌కి ఫోన్ ఇచ్చి ‘అందరి ముందు మీ అబ్బాయ్‌కి ఏమైనా చెప్పు. తిట్టాలనుకుంటే తిట్టేయ్.’ అని బాలకృష్ణ అన్నారు. పవన్ కళ్యాణ్ ఫోన్ తీసుకుని సిగ్గు పడుతూ ‘సరేరా. జాగ్రత్త. ఉంటా.’ అని ఫోన్ కట్ చేశారు.

Continues below advertisement