Anil Kumar On Kotamreddy : వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. ఇద్దరం స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా చేసి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తేల్చుకుందామన్నారు. దమ్ముంటే రాజీనామా చేయాలని అనిల్ కుమార్ ఆగ్రహంతో ఊగిపోయారు. 


51 సెకండ్ల వీడియో రిలీజ్ చేయాలి


నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, తొలిసారిగా కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందించారు. ట్యాపింగ్ జరగలేదని తేల్చిచెప్పారు. దమ్ముంటే రాజీనామా చేయాలని కోటంరెడ్డికి సవాల్ విసిరారు. రాజీనామా చేస్తే ట్యాపింగ్ వ్యవహారం నిగ్గు తేలుస్తామన్నారు. నిజంగా ట్యాపింగ్ జరిగిందని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవి వదిలేసుకుంటానన్నారు అనిల్ సవాల్ విసిరారు. ట్యాపింగ్ జరగలేదని తాము నిరూపిస్తే కోటంరెడ్డి ఎమ్మెల్యే పదవిని వదిలేసుకోవాలని సవాల్ విసిరారు. 24 గంటలు సమయం  ఇస్తున్నాని, కోటంరెడ్డి ఎప్పుడైనా వచ్చి ట్యాపింగ్ నిరూపించాలన్నారు. శ్రీధర్ రెడ్డి ఫోన్ టాపింగ్ జరిగిందని కేవలం 16 సెకండ్ల ఆడియో మాత్రమే రిలీజ్ చేశారని, మీడియాకు ఫోన్లో చూపించిన ఆడియో 51 సెకండ్ లు  ఉందన్నారు. శ్రీధర్ రెడ్డికి దమ్ముంటే 51 సెకండ్ల వీడియో బయట పెట్టాలన్నారు. 51 సెకండ్ల వీడియో బయట పెడితే శ్రీధర్ రెడ్డి బాగోతం మొత్తం బయటపడుతుందన్నారు. జనవరి 27న కోటంరెడ్డికి టీడీపీ టికెట్ ఖాయమైందని, ఆ తర్వాతి రోజే ఆయన ప్రెస్ మీట్ పెట్టారని చెప్పారు. సీఎం జగన్ కి తామిద్దరం ఎప్పుడూ రుణపడి ఉండాలని, కానీ శ్రీధర్ రెడ్డి పార్టీ మారుతూ జగన్ పై నిందలు వేయడం సరికాదన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి చచ్చిన పాము లాంటి వారని, ఆయన్ను ఇంకెవరైనా ఎందుకు టచ్ చేస్తారని, ఆయన చీటీ ఎప్పుడో చిరిగిపోయిందని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. 


సీఎం జగన్ వార్నింగ్ 
 
తనకు ఎంత సన్నిహితులైనా, పార్టీకోసం ఎంత కష్టపడి పనిచేసినా.. పార్టీ గీత దాటితే వేటు వేయకుండా వెనక్కి తగ్గేది లేదని మరోసారి నిరూపించారు సీఎం జగన్. వైసీపీ ఎమ్మెల్యేల ఆరోపణలను ఏమాత్రం సహించడంలేదు. నెల్లూరు జిల్లాలో వినిపించిన రెండు ధిక్కార స్వరాలను అలాగే అణచివేశారు. భవిష్యత్తులో కూడా తాను ఇలాగే ఉంటానని అందరికీ ఓ క్లారిటీ ఇచ్చారు. కోటంరెడ్డి స్థానంలో ఎంపీ ఆదాల ప్రభాకర్ టికెట్ ఖరారు చేశారు. ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే కఠిన చర్యలుంటాయని కోటంరెడ్డి, ఆనం ఎపిసోడ్ తో వార్నింగ్ ఇచ్చారు. అయితే పార్టీలో అప్పుడప్పుడూ వినిపిస్తున్న ధిక్కార స్వరాలు ఇకపై సైలెంట్ అవుతాయా లేక మరింత పెరుగుతాయో వేచి చూడాలి.  


వలస పక్షులు వెళ్లే కాలం - పేర్ని నాని 


ఎమ్మెల్యేల మీద నిఘా ఉంటే ఆధారం ఉండాలి కదా అని మాజీ మంత్రి పేర్ని నాని  ప్రశ్నించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పింది కాల్ రికార్డింగ్ గురించేనని, అది ఫోన్ ట్యాపింగ్ కాదన్నారు.  కోటంరెడ్డి ఫోన్ వాట్సాప్ ఛాటింగ్ ను బయటపెట్టాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. బయట వైరల్ అవుతున్న ఆడియోను కోటంరెడ్డికి పంపి చెక్ చేసుకుకోమని ఇంటెలిజెన్స్ చీఫ్ టెక్స్ట్ మెసేజ్ పెట్టారు. కోటంరెడ్డి తన అంతరాత్మని ప్రశ్నించుకోవాలన్నారు. గత ఏడాది డిసెంబర్ 25న చంద్రబాబు ఇంటికి బ్లూ కలర్ బెంజ్ కార్ వేసుకొని కోటంరెడ్డి వెళ్లారని ఆరోపించారు. అంతకు ముందు నుంచే కోటంరెడ్డి లోకేశ్ తో టచ్ లో ఉన్నారన్నారు.  సీఎం జగన్ కోటంరెడ్డి తన మనిషి అని విశ్వాసించారన్నారు. జగన్ పిచ్చి మారాజు, అందర్నీ నమ్మేస్తారన్నారు. ఒక చోట పనిచేస్తూ పక్క చూపులు చూస్తే ఎలా అని పేర్ని నాని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడు పక్షులు వలస వెళ్లే కాలం అన్నారు. కోటంరెడ్డి చేసింది కచ్చితంగా నమ్మకద్రోహమే అని పేర్ని నాని ఆరోపించారు. ఇంటెలిజెన్స్ విభాగం సతీష్ చంద్ర చంద్రబాబు హయాంలో కూడా ఉన్నారన్నారు. కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలు అభిమానంతో కాదని, పక్కా ప్లాన్ తో వచ్చిన మాటలు అన్నారు. కోటంరెడ్డి స్నేహితుడే కాల్ రికార్డింగ్ చేసి వైరల్ చేశారని పేర్ని నాని ఆరోపించారు.