టాలీవుడ్ టాప్ హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులు మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. పెళ్లైన పదేండ్ల తర్వాత వీరు పేరెంట్స్ కాబోతున్నారు. ఈ విషయాన్నిమెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. “శ్రీ హనుమాన్ జీ ఆశీర్వాదంతో, ఉపాసన & రామ్ చరణ్ తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు సంతోషిస్తున్నాం” అంటూ చిరు పోస్టు పెట్టారు.


‘RRR’ సినిమాతో కెరీర్ లోనే అద్భుత విజయాన్ని అందుకున్న రామ్ చరణ్, దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటుల జాబితాలో చేరాడు. గౌతమ్ తిన్ననూరితో కలిసి చేయబోతున్న ప్రాజెక్టుకు సంబంధించిన రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక, చరణ్ ఇప్పటికే రూ.1,370 కోట్ల రూపాయల విలువ చేసే నికర ఆస్తులను కలిగి ఉన్నట్లు సమాచారం. RRRతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన రామ్ చరణ్‌పై నేషనల్ మీడియా వివిధ కథనాలు ప్రచురిస్తోంది. తాజాగా ఆయన ఆస్తులపై కూడా ఓ మీడియా సంస్థలో వార్తలు  వచ్చాయి. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం.. రామ్ చరణ్ ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. 


 1. విలాసవంతమైన బంగ్లాలు


హౌసింగ్.కామ్ అనే వెబ్ సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ లోని అత్యంత విలాసవంతమైన బంగ్లా కోసం రామ్ చరణ్ సుమారు రూ.30 కోట్లు వెచ్చించాడని సమాచారం. 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఇల్లు నిర్మించారు. ప్రఖ్యాత ఇంటీరియర్ డిజైనర్ తరుణ్ తహిలియాని దీనికి డిజైన్ చేశారు. ఈ ఇంట్లో రాంచరణ్, తన భార్య ఉపాసన, తండ్రి చిరంజీవి, తల్లి సురేఖ ఉంటారు. ఇందులో భారీ స్విమ్మింగ్ పూల్, జిమ్నాసియం, టెన్నిస్ కోర్ట్,  ఫిష్‌పాడ్‌లతో సహా ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. హైదరాబాద్ లోని ఇల్లుతో పాటు  ముంబైలోని ఖార్‌లో అద్భుతమైన పెంట్‌హౌస్‌ కూడా ఉందట చరణ్‌కు. దాని ధర కూడా సుమారు రూ.30 కోట్లు అని సమాచారం. 






2. ఫెరారీ పోర్టోఫినో


రామ్ చరణ్ కు విలాసవంతమైన కార్లు అంటే ఎంతో ఇష్టం. చక్కటి వీల్స్ ఉండే కార్లను ఎక్కువగా నచ్చుతాడు. అందుకే ఆయన ఫెరారీ పోర్టోఫినో కొనుగోలు చేశాడు. దీని విలువ సుమారు రూ. 3.50 కోట్లు ఉంటుంది. గతేడాది ఈ కారును కొనుగోలు చేసిన రామ్ చరణ్.. ఓ సినిమా ఈవెంట్ కు దీనిలో వెళ్లాడు. ఈ సందర్భంగా కారు దగ్గర నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చాడు.   


3. ప్రైవేట్ జెట్


రీజనల్ ఎయిర్‌లైన్ సర్వీస్ (ట్రూజెట్) యజమాని అయిన రామ్ చరణ్.. తన కోసం ప్రత్యేకంగా ఒక ప్రైవేట్ జెట్ కొనుగోలు చేశాడు. ఇప్పటి వరకు ప్రైవేట్ జెట్స్‌ ఉన్న షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా, హృతిక్ రోషన్, అమితాబ్ బచ్చన్ జాబితాలో చేరాడు. 


4. రోల్స్ రాయిస్ ఫాంటమ్


చరణ్ గ్యారేజీలో పార్క్ చేసిన అతి ఖరీదైన కారు రోల్స్ రాయిస్ ఫాంటమ్. కార్‌దేఖోకు అంచనా ప్రకారం ఈ కారు ధర రూ. 9 కోట్ల నుంచి రూ. 10.48 కోట్ల వరకు ఉంటుంది. అయితే, ఈ కారుకు రామ్ చరణ్ స్పెషల్ వీల్స్ ఏర్పాటు చేయించినట్లు తెలుస్తోంది.  


5. ఆస్టన్ మార్టిన్ V8 వాన్టేజ్


చెర్రీ వద్ద ఆస్టన్ మార్టిన్ V8 వాన్టేజ్ అనే మరో విలాశవంతమైన కారు కూడా ఉంది. ఈ లగ్జరీ స్పోర్ట్స్ కారు ధర రూ.3 కోట్ల నుంచి రూ. 3.50 కోట్ల వరకు ఉంటుంది. ఇది కేవలం 3.6 సెకన్లలో 60 mph వేగాన్ని అందుకుంటుంది.


ఇతర పెట్టుబడులు


సినిమాల్లో నటించడంతో పాటు ఎండార్స్‌మెంట్ల ద్వారా చెర్రీ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్లు సమాచారం. ఈ డబ్బును రియల్ ఎస్టేట్‌లో  భారీగా పెట్టుబడి పెట్టినట్లు తెలిసింది. చెర్రీకి రూ. 100 - 200 కోట్ల విలువైన ప్రొడక్షన్ హౌస్ (కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ) ఉంది. హైదరాబాద్ పోలో క్లబ్ & హార్స్‌ లో దాదాపు రూ. 20 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. అలాగే అపోలో హాస్పిటల్స్‌లో కూడా వాటాలు ఉన్నాయట.  చరణ్ 2015లో హైదరాబాద్‌లో ప్రాంతీయ విమానయాన సంస్థ (ట్రూజెట్)ని కూడా ప్రారంభించాడు. అయితే ఆర్థిక సమస్యల కారణంగా,  కార్యకలాపాలను నిలిపివేయవలసి వచ్చిందని తెలిసింది.


Read Also: Urfi Javed: ఉర్ఫీ జావేద్ ఎవరు? ఎందుకు సోషల్ మీడియాలో సంచలనం అవుతోంది?