‘జైలర్’ సంచలన విజయంతో మంచి జోష్ లో ఉన్నారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. అదే ఉత్సాహంతో మరో సినిమా చేయబోతున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు టీజీ జ్ఞానవేల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ‘తలైవా 170’ అనే వర్కింగ్ టైటిల్ లో ఈ సినిమా పనులు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం కీలక విషయాన్ని తెలిపింది. ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నట్లు తెలిపింది. వారి పేర్లను సైతం వెల్లడించింది. రజనీ కాంత్ ప్రతిష్టాత్మక చిత్రంలో మంజూ వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ నటించబోతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటనతో సదరు హీరోయిన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రజనీకాంత్ తో కలిసి నటించేందుకు ఉత్సాహం చూపుతున్నారు.
కీలక పాత్రలు పోషించనున్న పలువురు అగ్ర హీరోలు
ఈ సినిమాలో పలువురు అగ్ర హీరోలు నటించబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర చేస్తున్నారట. మరోవైపు మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ కూడా మరో ముఖ్యమైన పాత్ర కోసం ఎంపికయ్యారట. తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి నానిని ఈ చిత్రంలో నటించాల్సిందిగా చిత్రబృందం కోరిందట. కానీ, కొన్ని కారణాలతో ఆయన ఈ సినిమాను వదులుకున్నారట. ఆయన స్థానంలో శర్వానంద్ ను తీసుకునే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఆయన కూడా ఈ సినిమా చేయలేనని చెప్పారట. ఇప్పుడు రానాకు ఆ ఛాన్స్ లభించినట్లు తెలుస్తోంది. ఇంతకీ టాలీవుడ్ నుంచి ఈ చిత్రంలో నటించే హీరో ఎవరు అనేది త్వరలోనే అధికారికంగా వెల్లడి అయ్యే అవకాశం ఉంది.
ఈ సినిమా కథ ఏంటంటే?
ఇక ఈ సినిమా ఓ బూటకపు ఎన్ కౌంటర్ కథాంశంతో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు జ్ఞానవేల్ గతంలో జర్నలిస్టుగా పని చేశారు. చెన్నైలో ఆయన రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో పోలీసులు ఓ బూటకపు ఎన్ కౌంటర్ చేశారట. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ ఘటనను జ్ఞానవేల్ రిపోర్ట్ గా దగ్గరి నుంచి గమనించారు. అదే విషయాన్ని కథగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమా ఇప్పటికే ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. చెన్నైలో ఇటీవల పూజా కార్యక్రమాలతో పనులు మొదలు పెట్టారట.
2024లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం
రజనీకాంత్, జ్ఞానవేల్ కాంబోలో వస్తున్న ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘జైలర్’ మూవీతో రజనీకాంత్, ‘జైభీమ్’ సినిమాతో జ్ఞానవేల్ మంచి విజయాలను అందుకున్నారు. వీరిద్దరు కలిసి చేస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులలలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్‌ను సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ షెడ్యూల్ సహా పలు విషయాలను చిత్ర బృందం త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.
Read Also: ఓర్ని.. పెళ్లికి ముందు చిన్న పిల్లల్లా మారిపోయిన పరిణితీ, రాఘవ్ - మీకూ ఇలా ఆడాలని ఉందా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial