Srikanth Odela : నేచురల్ స్టార్ నాని, హీరోయిన్ కీర్తి సురేష్ జంటగా నటించిన 'దసరా' ఇటీవలే విడుదలై ఎంతటి భారీ విజయాన్ని నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించగా.. తాజాగా ఈ డైరెక్టర్ గురించి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. శ్రీకాంత్ త్వరలోనే ఓ ఇంటివాడవుతున్నాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.


శ్రీకాంత్ ఓదెల వివాహం కరీంనగర్ లో జరగనున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి హడావిడి లేకుండా ఆయన వివాహం జరగనున్నట్టు నెట్టింట పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ పెళ్లికి కేవలం తనకు పరిచయమున్న వారినే ఆహ్వానించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ వివాహ వేడుకకు శ్రీకాంత్ గురువు, ప్రముఖ దర్శకుడు సుకుమార్ హాజరు కానున్నట్టు సమాచారం. అల్లు అర్జున్ నటిస్సోన్న 'పుష్ప 2' షూటింగ్ ను మే 30న మారేడుమిల్లిలో ముగించుకుని.. అక్కడ్నుంచి సుకుమార్ నేరుగా కరీంనగర్ కు ప్రయాణమైనట్టు తెలుస్తోంది. ఇక 'దసరా' సినిమాలో నాని సరసన నటించి, మెప్పించిన కీర్తి సురేష్ కూడా శ్రీకాంత్ వివాహానికి హాజరవనున్నట్టు సమాచారం.


ఎవరెవరు హాజరు కానున్నారంటే..


సినీ పరిశ్రమలో ఉన్నస్నేహితులకు కూడా పెళ్లి ఆహ్వానం పంపిన శ్రీకాంత్.. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన 'ఉప్పెన' తో మంచి హిట్ కొట్టిన దర్శకుడు బుచ్చిబాబు సానా కూడా హాజరు అవుతున్నట్టుగా తెలుస్తోంది. 'దసరా' సినిమా నిర్మాత, ఆ సినిమాకి పని చేసిన కొంతమంది యూనిట్ సభ్యులు కూడా శ్రీకాంత్ పెళ్లికి రానున్నట్టు సమాచారం. 


అమ్మాయి ఎవరంటే..


ఇక శ్రీకాంత్ వివాహం చేసుకునే అమ్మాయికి సంబంధిన విషయాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. దీంతో ఆమె ఎవరు, ఏం చేస్తుంది అన్న విషయాలు తెలుసుకోవడానికి ఆయన ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. అంతకుముందు శ్రీకాంత్ ఓదెల.. సినీ పరిశ్రమలో ఒక సినిమా దర్శకత్వం చేసిన తరువాతే వివాహం చేసుకుంటానని నిర్ణయించుకున్నాడని చెప్పినట్టు టాక్. అలా 'దసరా' సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు.. ఆ మూవీ విడుదలై మంచి హిట్ కూడా అవడంతో అతను ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. 


ఆరు రోజుల్లోనే రూ.100 కోట్లు..


ఇటీవల విడుదలైన దసరా మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వసూలు చేసింది. విడుదలైన ఆరు రోజుల్లోనే రూ.100కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టి రికార్డు సృష్టించింది. విమర్శకులు సైతం ప్రశంసించిన ఈ సినిమాకు టాలీవుడ్ లోని పలువురు స్టార్ సెలబ్రెటీలు కూడా ఫిదా అయ్యారు. దసరా మూవీ చూసిన మెగాస్టార్ చిరంజీవి కూడా మూవీ టీమ్ ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. సినిమాలో నాని మేకోవర్ ను ఆయన మెచ్చుకున్నారు. ఇంతటి బ్రిలియంట్ మూవీ తీసిన శ్రీకాంత్ ఓదెల ఒక డెబ్యూ డైరెక్టర్ అని తెలిసి ఆశ్చర్యపోయినట్లు ప్రస్తావించారు. ఈ ట్వీట్ కు రిప్లైగా శ్రీకాంత్. ‘ఇంద్ర’ సినిమాలోని ‘దాయి దాయి దామ్మా’ పాటకు తను వీణ స్టెప్ వేసిన ఫొటోను షేర్ చేశారు. అంతేకాదు ఈ ఫొటోకు ‘ఎగురుతున్నా.. థాంక్యూ బాస్’ అంటూ ఓ క్యాప్షన్ కూడా జత చేశారు. ఎప్పుడూ ఇంట్రావర్ట్‌గా ఉండే శ్రీకాంత్ ఇలా డాన్స్ చేస్తుండటం చూసి నెటిజన్లు కూడా షాక్ కు గురయ్యారు, ఆశ్చర్యం వ్యక్తం చేశారు.


Read Also : అది గతం, ఆలోచిస్తూ కూర్చోకూడదు - ‘రానా నాయుడు’ విమర్శలపై స్పందించిన వెంకటేష్