దివంగత కథానాయకుడు, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar) భౌతికంగా ప్రేక్షకులకు దూరమైనప్పటికీ... సినిమాలతో ఎప్పుడూ కళ్ళ ముందు మెదులుతున్నారు. ఆయన నటించిన కన్నడ సినిమా తెలుగులో డబ్ అవుతోంది. విజయ దశమి సందర్భంగా టీజర్ విడుదల చేశారు. త్వరలో విడుదల తేదీ వెల్లడించనున్నారు. అసలు వివరాల్లోకి వెళితే...
పునీత్ రాజ్ కుమార్ నటించిన కన్నడ సినిమా 'చక్రవ్యూహ' (Chakravyuha Kannada Movie). ఆరేళ్ళ క్రితం... 2016లో విడుదల అయ్యింది. తమిళంలో విక్రమ్ ప్రభు, సురభి జంటగా నటించిన 'ఇవాన్ వెరమాతిరి'కి రీమేక్‌గా రూపొందింది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.
Puneeth Rajkumar's Civil Engineer Movie : పునీత్ రాజ్ కుమార్‌కు జంటగా డింపుల్ క్వీన్ సరసన రచితా రామ్ (Rachitha Ram) నటించిన 'చక్రవ్యూహ' సినిమాను తెలుగులో 'సివిల్ ఇంజనీర్'గా అనువదిస్తున్నారు. ఇందులో అరుణ్ విజయ్ (Arun Vijay) విలన్ రోల్ చేశారు. దసరా సందర్భంగా 'సివిల్ ఇంజనీర్' టీజర్ విడుదల చేశారు.
కమర్షియల్ అంశాలతో...
కాలేజీలో గొడవలు, విద్యార్థి హత్య, నాయ్యం కోసం పోరాటం వంటి అంశాలతో సినిమా రూపొందిందని 'సివిల్ ఇంజనీర్' టీజర్ చూస్తే అర్థం అవుతోంది. పక్కా కమర్షియల్ అంశాలతో సినిమా తెరకెక్కింది. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన నటీనటులు 'సివిల్ ఇంజనీర్'లో ఉన్నారు. పునీత్, రచిత మధ్య లవ్ సీన్స్ ఉన్నాయి.
''శాండల్‌వుడ్‌లో 'సివిల్ ఇంజనీర్' భారీ కలెక్షన్లతో సంచలనం సృష్టించింది. మన తెలుగులో కూడా సినిమా సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాం. టీజర్ రెస్పాన్స్ బావుంది. సంగీత సంచలనం ఎస్. తమన్ చేసిన నేపథ్య సంగీతానికి మంచి రెస్పాన్స్ వస్తోంది'' అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రాన్ని తెలుగులో చందన ప్రొడక్షన్స్ సంస్థ ద్వారా విడుదల చేస్తున్నారు. టీ.ఎన్. సూరిబాబు నిర్మాత నిర్మించారు. త్వరలో విడుదల తేదీ వెల్లడించనున్నారు.
Also Read : 'గాడ్ ఫాదర్' రివ్యూ : మెగాస్టార్ మూవీ హిట్టా? చిరంజీవి రాజకీయ నేపథ్య చిత్రమ్ ఎలా ఉందంటే?
పునీత్ రాజ్ కుమార్ 'యువరత్న' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ లభించింది. 'జేమ్స్' చిత్రానికీ చక్కటి ప్రేక్షకాదరణ లభించింది. ఇప్పుడీ 'సివిల్ ఇంజనీర్' సినిమాకూ అదే స్థాయిలో ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నారు.
రియల్ లైఫ్‌లో సేవా కార్యక్రమాలతో పునీత్ రాజ్ కుమార్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. పునీత్ నేత్రాలను దానం చేశారు. ఆయన కార్నియా ద్వారా నలుగురికి చూపు లభించింది. ఆయన స్టెమ్ సెల్స్ ద్వారా ఐదు నుంచి పది మందికి చూపు ఇచ్చే ప్రయత్నాలు జరిగాయి.
పునీత్ మరణం తర్వాత ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఎటువంటి లోటు రానివ్వకూడదని రాజ్ కుమార్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు ముందుకు వస్తున్నారు. పునీత్ చదివిస్తున్న పద్దెనిమిది వందల మంది పిల్లలను తాను చదివిస్తానని హీరో విశాల్ మాట ఇచ్చిన సంగతి తెలిసిందే.
Also Read : ది ఘోస్ట్ రివ్యూ: సంక్రాంతి హిట్‌ను నాగార్జున దసరాకు రిపీట్ చేశారా?