Natti Kumar: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రస్తుతం సినిమాలకు విరామం ఇచ్చి రాజకీయాల్లో యాక్టీవ్ గా తిరుగుతున్నారు. ఇటీవలే వారాహి యాత్రలో భాగంగా కాకినాడ వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. అప్పటి నుంచి ఈ నేతలిద్దరి మధ్య మాటల యుద్దం నడుస్తోంది. ఈ నేపథ్యంలో కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం జోక్యం చేసుకొని పవన్ కళ్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఒక వీధి రౌడీలా మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు. ప్రస్తుతం పవన్ పై ముద్రగడ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముద్రగడ లేఖపై సినీ నిర్మాత నట్టి కుమార్ స్పందించారు.


పవన్ ను వ్యక్తిగతంగా ధూషించడం బాధకలిగించింది: నట్టి కుమార్ 


పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ముద్రగడ విడుదల చేసిన లేఖపై సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ స్పందించారు. ఈ మేరకు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారాయన. రాజకీయాల్లో విమర్శప్రతివిమర్శలు సహజమేనని కానీ వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని అన్నారు. రాజకీయాలన్నా ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ లోకల్ సమస్యల గురించి ప్రశ్నిస్తారని, ఆ మాత్రం దానికి పవన్ ను కాకినాడలో అడుగుపెట్టనివ్వని ద్వారంపూడి బెదిరింపు వ్యాఖ్యలు చేయడం సరికాదని దుయ్యబట్టారు. ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అసలు కాకినాడ ఏపీలో ఉందా అనే అనుమానం వ్యక్తమవుతోందన్నారు. ద్వారం పూడి వ్యాఖ్యలు వైసీపీకు నష్టం చేకూర్చేలా ఉన్నాయని ఉటంకించారు. 


పవన్ కళ్యాణ్ మార్గం సరైనదే..


గత 35 ఏళ్లుగా తాను ఇండస్ట్రీలో ఉంటున్నానని ఎవరు ఎలాంటి వారో తమకు తెలుసన్నారు. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడం తప్ప పవన్ కళ్యాణ్ కు ఇలాంటి కుళ్లు రాజకీయాలు తెలియవని పేర్కొన్నారు. పవన్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా డ్రగ్స్ తీసుకుంటాడు, మూడు పెళ్లిల్లు అని వ్యక్తిగత విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. ఈ వ్యవహారంలోకి ముద్రగడ పద్మనాభం ఎందుకు ఎంటరయ్యారో తెలియడం లేదన్నారు. ముద్రగడ కాపు ఉద్యమ నేత అయి ఉండి పవన్ కళ్యాణ్ ను రౌడీ అనడం తగదన్నారు. అయినా ముద్రగడ ఉద్యమాలు ఏమీ సక్సెస్ కాలేదని, అవి అంత ప్రభావం చూపించవని వ్యాఖ్యానించారు. కాపులు ఎవరు ముఖ్యమంత్రి అయినా అది ఏ పార్టీ వారైనా తాను స్వాగతిస్తానని స్పష్టం చేశారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ వెళ్తోన్న మార్గం సరైనదేనని, ఆయన కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని అన్నారు.


చిన్న సినిమాలకు 5 షోలు ఇవ్వాలి..


ఇక ఇదే ప్రెస్ మీట్ లో చిన్న సినిమా పరిశ్రమ గురించి పలు వ్యాఖ్యలు చేశారు నట్టి కుమార్. టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న సినిమాలే ఎక్కువగా విడుదల అవుతాయని అన్నారు. వేలాది మంది కార్మికులు ఈ సినిమాలపైనే ఆధారపడి బతుకుతున్నారని చెప్పారు. అలాంటి చిన్న సినిమాలకు ప్రస్తుతం మనుగడ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఎప్పటి నుంచో చిన్న సినిమాల కోసం థియేటర్లలో ఐదవ షోకు కూడా అనుమతులు ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరుతున్నామని చెప్పారు. ‘ఆదిపురుష’ లాంటి సినిమాలకు 6 షోలు ఇచ్చారని, తాము చిన్న సినిమాల కోసం కేవలం 2-30 గంటల మాట్నీ షో మాత్రమే ఎప్పట్నుంచో అడుగుతున్నామన్నారు. దీన్ని అమలులోకి తేవాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు నట్టి కుమార్.


Read Also: 'కెజియఫ్' కాదు, అంతకు మించి, 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' రేంజ్‌లో 'సలార్' - శ్రియా రెడ్డి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial