మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలోకి మెగా ప్రిన్సెస్ రావడంపై సినీ ప్రముఖులు అందరి నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రామ్ చరణ్ - ఉపాసన దంపతులకు పెళ్లైన 11 ఏళ్ల తర్వాత మొదటి సంతానంగా ఆడపిల్ల జన్మించింది. నిన్న (జూన్ 20) ఉదయం 6 గంటలకు ఉపాసన ఆడబిడ్డకు జన్మ ఇచ్చిందని స్వయంగా చిరంజీవి ప్రకటించారు. మంగళవారం పూట తమ ఇంట్లో ఆడపిల్ల పుట్టడం తాము అదృష్టంగా భావిస్తున్నట్లుగా చెప్పారు. ఈ వార్త బయటికి రాగానే మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అంతేకాక, సినీ ప్రముఖులు వివిధ మాధ్యమాల ద్వారా ఉపాసన - రామ్ చరణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాత అయినందుకు చిరంజీవికి కూడా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.


ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా కూడా స్పందించారు. ట్వీట్ చేస్తూ తన శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ చిన్న తనంలో ఆయన్ను ఎత్తుకున్న రోజులను రోజా గుర్తు చేసుకున్నారు. చిరంజీవికి తాత అనే పేరు వచ్చినప్పటికీ ఆయనొక ఎవర్ గ్రీన్ హీరో అని కొనియాడారు.


‘‘తాత అయినందుకు చిరంజీవి గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎప్పుడూ యువకుడి తరహా మనసు, ఎనర్జీతో కూడిన వ్యక్తిత్వంగల మీ కుటుంబంలోకి ఒక లవ్లీ మెగా ప్రిన్సెస్‌ రావడం ఒక ఆశీర్వాదం. డియర్ రామ్ చరణ్.. నువ్వు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు నిన్ను నా చేతులతో హత్తుకున్న రోజులు మర్చిపోలేను. ఆ రోజులు మళ్లీ గుర్తొచ్చాయి. అలాంటి నీకు ఇప్పుడు కూతురు పుట్టడం మరింత ఆనందకరం. చిరంజీవి సర్.. మీకు తాత అనే పేరు వచ్చినప్పటికీ మీరొక ఎవర్ గ్రీన్ హీరో. అలాగే ఉపాసన కొణిదెల, మీ ఇంటి చిట్టి మహాలక్ష్మికి నా ఆశీస్సులు’’ అని మంత్రి రోజా ట్వీట్ చేశారు.