Nagavamsi Controversial Comments: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత, ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఎప్పుడో ఒకసారి కానీ మీడియా ముందుకు రారు. కానీ ఆయన వచ్చినప్పుడు మాట్లాడే మాటలు ఒక్కోసారి ముక్కు సూటిగా అనిపిస్తాయి. కొన్నిసార్లు వివాదాలకు కారణం అవుతాయి. అలానే ఒక ఇంటర్వ్యూలో నాగవంశీ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. అసలు ఇంతకీ ఆయన ఏమన్నారు?


సినిమాకు రూ.1500 పెట్టలేరా...?
‘ప్రస్తుతం సింగిల్ స్క్రీన్లలో దేవర టికెట్ రేట్ రూ.250 వరకు ఉంది. కుటుంబంలో ఉండే నలుగురు సినిమాకు వెళ్తే టికెట్లకు రూ.1000 అవుతుంది. ఇంటర్వెల్‌లో పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ స్నాక్స్ కొనుక్కుంటే ఇంకో రూ.500. మూడు గంటల్లో రూ.1500కు మీకు ఇంత ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కడ దొరుకుతుంది? సినిమా అనేది చీపెస్ట్ ఫాం ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్. ఒక మాల్‌కు వెళ్తే మీకు రూ.1500 కంటే ఎక్కువే ఖర్చవుతుంది.’ అన్నారు నాగవంశీ. దీనిపై ఇంటర్నెట్లో విపరీతమైన విమర్శలు వస్తున్నాయి.


చాలా మంది నెటిజన్లు ఈయన వ్యాఖ్యలపై విరుచుకుపడుతున్నారు. హైదరాబాద్‌లో ధనవంతుల ఇంట్లో పుట్టిన నీకు రూ.1500 తక్కువ కావచ్చేమో కానీ, పట్టణాలు, గ్రామాల్లో రూ.1500 అనేది చాలా ఎక్కువ మొత్తం అని, కావాలంటే ఒక్కసారి ఆయా ప్రాంతాలకు వెళ్లి కనుక్కుంటే తెలుస్తుందని ఒకరు ట్వీట్ చేశారు. రూ.1500 పెట్టి ఏదైనా షాపింగ్ చేస్తే దాన్ని పూర్తిగా పరిశీలించి బాగుంటేనే, తమకు నచ్చితేనే తీసుకుంటామని, చూసిన సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులు వెనక్కి ఇస్తారా అని ఇంకొకరు ప్రశ్నించారు. 


రూ.1500కు నెలకు నలుగురు రెండు పూటలా తినడానికి 25 కేజీల బియ్యం వస్తుందని, ‘మూడు గంటల ఆనందం వర్సెస్ 30 రోజుల ఆకలి’పై మీరేమంటారని మరొకరు ప్రశ్నించారు. నాగవంశీ ఇప్పటికే టికెట్ రేట్ల విషయంలో డిస్‌కనెక్ట్ అయిపోయారని, ఇటీవలే టికెట్ రేట్లపై ఎంతో అనుభవం ఉన్న నిర్మాత సురేష్ బాబు ఏమన్నారో ఒకసారి వినాలని మరొకరు సలహా ఇచ్చారు. నాగవంశీ మాటలపై నెటిజన్ల రెస్పాన్స్‌ను కిందనున్న ట్వీట్లలో చూడండి. 























Also Readఅప్డేట్స్ జాతర @ టాలీవుడ్ - దసరాకు ఎవరెవరు ఏయే కొత్త విషయాలు చెప్పారో తెలుసా?