NBK 109 Release Date: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు బాబీ కొల్లి ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కిస్తున్నారు. బాలయ్య కెరీర్ లో 109 సినిమాగా ఇది రూపొందుతోంది.  మూవీ ప్రకటన నుంచే భారీగా అంచనాలు నెలకొన్నాయి. నందమూరి అభిమానులతో పాటు, సినీ లవర్స్ ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్  డేట్ పై నిర్మాత నాగ వంశీ కీలక విషయాలు వెల్లడించారు.


సంక్రాంతికి బరిలో NBK 109


తాజాగా ‘లక్కీ భాస్కర్‘ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నాగవంశీ పనిలో పనిగా బాలయ్య మూవీకి సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. ‘NBK 109‘ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు తెలిపారు. అయితే, డేట్ ఇంకా ఫిక్స్ కాలేదన్నారు. మంచి రోజు చూసి చెప్తామని బాలయ్య అన్నారని చెప్పారు. ఆయన డేట్ ఓకే చేయగానే అఫీషియల్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామన్నారు. “బాలయ్య సినిమా సంక్రాంతికి విడుదల అవుతుంది. డేట్ ఇంకా నిర్ణయించలేదు. మంచి రోజు చూసి చెప్తానని బాలకృష్ణ సర్ చెప్పారు. ఆయన చెప్పగానే అఫీషియల్ గా రిలీజ్ డేట్ ప్రకటిస్తాం” అన్నారు.    






‘గేమ్ ఛేంజర్’తో బాలయ్య మూవీ పోటీ


రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ ను సంక్రాంతి సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇప్పుడు బాలయ్య సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. బాక్సాఫీస్ దగ్గర ఈ రెండు పెద్ద సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. అయితే, ఈ చిత్రాలు ఒకే రోజున విడుదల కావని నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. రెండు సినిమాల మధ్య గ్యాప్ ఉంటుందన్నారు. దీపావళికి ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయనున్నట్లు తెలిపారు. ‘గేమ్ ఛేంజర్’ సినిమాను తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


సంక్రాంతి సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా?


దర్శకుడు బాబీతో పాటు బాలయ్యకు సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. సంక్రాంతి బరిలోని నిలిస్తే తమ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొడతాయని నమ్ముతారు. ఈ ఏడాది సంక్రాంతికి రెండు బాబీ దర్శకత్వం వహించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ఒకటి బాలయ్య మూవీ 'వీర సింహా రెడ్డి' కాగా, మరొకటి మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'. ఈ రెండు సినిమాలు హిట్ టాక్ను సంపాదించుకున్నాయి. ఇప్పుడు బాలయ్యతో చేసే సినిమా సైతం సంక్రాంతికి విడుదల అవుతుంది. ఈ సినిమాపైనా భారీగా అంచనాలు నెలకొన్నాయి.


‘NBK 109‘ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ నెగెటివ్ రోల్ పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్నది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.



Read Also: హీరోయిజం, ఫైట్లు, డ్యాన్స్ లు చాలు - కథ, స్క్రీన్ ప్లే, తొక్కా తోలు ఎవడికి కావాలి?: నాగవంశీ