Naga Vamsi About Story And Screenplay: సూర్య దేవర నాగవంశీ. ప్రముఖ నిర్మాత, సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణ సంస్థ అధినేత. ఆయన ఏ విషయాన్నైనా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా చెప్తారు. అదే  ఇప్పుడు ఆయనకు తల నొప్పులు తెచ్చి పెట్టింది. ఇటీవల సినిమా టికెట్ రేట్ల గురించి ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఫ్యామిలీ కోసం రూ. 1500 ఖర్చు పెట్టలేరా? అన్న వ్యాఖ్యలను చాలా మంది తీవ్రంగా తప్పుబట్టారు. తాజాగా సినిమా కథలు, స్క్రీన్ ప్లే గురించి  షాకింగ్ కామెంట్స్ చేశారు. నిర్మాతగా మంచి పేరున్న ఆయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదంటూ సినీ జనాలు ఆశ్చర్యపోతున్నారు.


కథా బలం, స్క్రీన్ ప్లే తొక్కా తోలు ఎవడు అడిగాడు?


తాజాగా 'లక్కీ భాస్కర్' ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ సినిమా కథ గురించి, స్క్రీన్ ప్లే గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. కథ, కథా బలం, దాని స్క్రీన్ ప్లే, తొక్కా తోలు ఎవడు అడిగాడు? అసలు అవన్నీ ఎవడికి కావాలి?  అంటూ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. ''సినిమా చూసే విధానం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ‘సలార్’ లాంటి సినిమాను తీసుకుంటే ప్రభాస్, 30, 40 మంది విలన్స్ ను కొట్టాలని ఆడియెన్స్ భావిస్తారు. హీరోకి హై ఎలివేషన్ ఉండాలి. హీరోయిజం చూపించాలి. బాగా డ్యాన్స్ వేయాలి. మంచి ఫైట్స్ చేయాలి. కామెడీ ఉండాలి. ఇవన్నీ ఆలోచించే పెద్ద హీరోల సినిమాలకు వెళ్తాం.  వాళ్లు కోరుకున్న ఎలిమెంట్స్ ఉంటే చాలు కదా? కథ, కథా బలం, దాని స్క్రీన్ ప్లే,  తొక్కా తోలు ఎవడు అడిగాడు? అసలు అవన్నీ ఎవడికి కావాలి?” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నాగవంశీ కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అసలు నాగ వంశీకి ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అంటూ ఆడియెన్స్ తో పాటు సినీ  ప్రముఖులు చర్చించుకుంటున్నారు.  






సినిమా రివ్యూల పైనా నాగవంశీ కీలక వ్యాఖ్యలు


అటు చాలా మంది ఈ రోజుల్లో సినిమా చూడకుండానే ఓ నిర్ణయానికి వస్తున్నారని నాగవంశీ అన్నారు. సినిమా పోస్టర్, టీజర్, ట్రైలర్ ను చూసి సినిమా చూడాలా? వద్దా? అనే నిర్ణయానికి వస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో పెట్టే రివ్యూలు సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ ను డిసైడ్ చేస్తున్నాయని తెలిపారు. పది మంది నెటిజన్లలో ఐదుగురు సినిమా బాగుందని చెప్తే సినిమా సూపర్ హిట్ అయినట్లేనన్నారు. అయితే, చిన్న సినిమాలు మౌత్ పబ్లిసిటీతో మంచి సక్సెస్ అందుకుంటున్నాయని వెల్లడించారు. ప్రేక్షకులు సినిమా చూడాలి అనుకుంటే చూస్తారని చెప్పారు. ఒకటి రెండు శాతం మంది సోషల్ మీడియా రివ్యూలను చూసి ప్రభావితం అవుతారు తప్ప, మిగతావాళ్లు థియేటర్లకు వెళ్తారని చెప్పారు. కొంత మంది కావాలని సినిమాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని నాగవంశీ ఆరోపించారు.



Read Also: కంగనా ‘ఎమర్జెన్సీ’కి సెన్సార్ క్లియరెన్స్... మరీ అన్ని కట్స్ అంటే అసలు మ్యాటర్ ఉంటుందా?