నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ సినిమా లియో, రవితేజ చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’తో పోటీ ఎదురైనా ఈ సినిమా చక్కటి విజయాన్ని అందుకుంది. వసూళ్ల పరంగా సత్తా చాటింది. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో పాల్గొన్న టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు హీరోయిన్ శ్రీలీలపై ప్రశంసల వర్షం కురిపించారు. 


శ్రీలీలపై నిర్మాత దిల్ రాజు ప్రశంసల జల్లు


'భ‌గ‌వంత్ కేస‌రి' సినిమాలో శ్రీలీల పాత్రకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు లభిస్తున్నాయి. ఇందులో బాల‌య్య కుమార్తె పాత్ర పోషంచిన శ్రీలీల న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల్ని బాగా ఆకట్టుకుంది.  ఆమె నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. అద్భుతంగా నటించిందని అభినందిస్తున్నారు. తాజాగా ప్రొడ్యూసర్ దిల్ రాజు సైతం ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు. శ్రీలీల ఎలాంటి పాత్ర అయిన అవ‌లీల‌గా పోషించ‌గ‌ల‌ద‌ని ఈ సినిమాతో రుజువు అయ్యిందన్నారు. ఆమె కెరీర్ లోనే ఈ పాత్ర గుర్తుండిపోతుందన్నారు. “‘భగవంత్ కేసరి’ సినిమా విడుదల ముందు వరకు శ్రీలీల అంటే మంచి డ్యాన్సర్ అని అనే వారు. నేను అలాగే అనుకునేవాడిని. కానీ, ఈ చిత్రంలో ఆమె నటన అద్భుతం. శ్రీదేవి, జయసుధ, జయప్రదలను మళ్లీ గుర్తు చేసింది. నటిగా శ్రీలీలకు మంచి భవిష్యత్తు ఉంది. సినిమాలను చక్కగా సెలెక్ట్ చేసుకుంటే గొప్ప స్థాయికి చేరుకుంటుంది. ఇంకా చెప్పాలంటే టాప్ పొజిషన్ కు వెళ్తుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు” అన్నారు దిల్ రాజు.


దిల్ రాజు మాటలకు శ్రీలీల ఫుల్ ఖుషీ


ఇక తెలుగు సినిమా పరిశ్రమలోని దిగ్గజ నటీమణులతో తనను పోల్చడం పట్ల శ్రీలీల సంతోషం వ్యక్తం చేసింది. దిల్ రాజు మాటలకు పొంగిపోతూ కనిపించింది. మరోవైపు దిల్ రాజు లాంటి వ్యక్తి శ్రీలీలను ఆ రేంజిలో పొగడటం పట్ల అందరూ ఆశ్చర్యపోతున్నారు. గతంలో ఏ హీరోయిన్ ను ఆయన శ్రీదేవి, జయసుధ, జయప్రదతో పోల్చిన సందర్భాలు లేవు. ఇప్పుడు ఆమెను వారితో పోల్చారంటే నిజంగా తనతో ఆ టాలెంట్ ఉందని అందరూ భావిస్తున్నారు. తెలుగమ్మాయి శ్రీలీలకు తెలుగు ఇండస్ట్రీలో ఇక తిరుగు ఉండదని అందరూ అభిప్రాయపడుతున్నారు.


బాలయ్య నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించారు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది.  శ్రీ లీల బాలయ్య కూతురుగా నటించింది. అర్జున్ రాంపాల్ విలన్‌‌ పాత్రలో కనిపించారు.  షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు.


Read Also: మావారి కంటే ఆయనే బెస్ట్, దీపికా కామెంట్స్‌కు రణవీర్ షాక్!



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial