టాలీవుడ్ లో నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా దూసుకుపోతున్నారు దిల్ రాజు. ప్రస్తుతం ఆయన నిర్మించిన 'థాంక్యూ' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు దిల్ రాజు. ఇప్పటికే పలుమార్లు టికెట్ రేట్స్ పై స్పందించిన ఆయన తాజాగా మరోసారి ఈ విషయంపై మాట్లాడారు. రీసెంట్ గా ఆయన 'థాంక్యూ' సినిమాకి టికెట్ రేట్స్ తగ్గించామని.. మునుపటి మాదిరి రూ.150కే టికెట్స్ అందుబాటులో ఉంటాయని చెప్పారు.
కానీ హైదరాబాద్ లాంటి సిటీలో మల్టీప్లెక్స్ లో 'థాంక్యూ' సినిమాకి రూ.200 రేటు ఉంది. ఈ విషయంపై ఆయన్ను ప్రశ్నించగా.. సినిమా టికెట్ రేట్స్ గురించి తనొకలా చెబితే మీడియాలో మరో రకంగా వార్తలొచ్చాయని అన్నారు దిల్ రాజు. ఎక్కడ తప్పు జరిగిందో అర్ధం కావడం లేదని.. జీవో ప్రకారమే 'ఎఫ్3' టికెట్ రేట్స్ ను అందుబాటులో ఉంచామని అన్నారు. ఆ తరువాత విడుదలైన 'విక్రమ్', 'మేజర్' సినిమాలకు చిత్రబృందాలు రేట్లు తగ్గించాయని.. 'థాంక్యూ' కూడా అదే కోవలోకి వస్తుందని అన్నారు.
హైదరాబాద్, వరంగల్ లాంటి సిటీల్లో సింగిల్ స్క్రీన్స్ లో ఒక్కో టికెట్ రూ.150 ప్లస్ జీఎస్టీ, మల్టీప్లెక్స్ లో రూ.200 ప్లస్ జీఎస్టీ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇకపై మాత్రం అన్ని సినిమాలకు ఒకటే రేటు ఉంటుందని వెల్లడించారు. నిర్మాతలందరం కలిసి చర్చించిన తరువాత టికెట్ రేట్స్ పై ఈ నిర్ణయం ప్రకటిస్తామని అన్నారు. అయితే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన స్టార్ హీరోల సినిమాలకు మాత్రం మినహాయింపు ఉంటుందని చెప్పుకొచ్చారు.
Also Read : 'ఆర్ఆర్ఆర్'లో పులితో ఎన్టీఆర్ ఫైట్ - వీఎఫ్ఎక్స్‌కు ముందు, తర్వాత
Also Read : అది పాస్తా వల్ల వచ్చిన కడుపు, ప్రెగ్నన్సీ కాదు - రూమర్లకు చెక్ పెట్టిన కరీనా కపూర్