Dil Raju About Naga Vamshi: తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరు దిల్ రాజు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలుపెట్టిన ఆయన, ‘దిల్’ సినిమాతో నిర్మాతగా పరిచయం అయ్యారు. వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మూవీ సక్సెస్ తర్వాత, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు ఎంతో మంది యువ దర్శకులకు అవకాశం కల్పించారు.
‘దిల్’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన సుకుమార్ తో కలిసి ‘ఆర్య’ అనే సినిమా చేశారు. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత భాస్కర్ తో కలిసి ‘బొమ్మరిల్లు’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఈ బ్యానర్ లో వచ్చిన ‘కొత్త బంగారులోకం’, ‘బృందావనం’, ‘మిస్టర్ ఫర్ఫెక్ట్’, లాంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నాయి. దిల్ రాజు సినిమా అంటే కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అనే టాక్ ఉండేది. ప్రస్తుతం దిల్ రాజు ప్లేస్ ను నాగ వంశీ భర్తీ చేసినట్లు అర్థం అవుతోంది.
నాగవంశీలో నన్ను నేను వెతుక్కుంటున్నాను- దిల్ రాజు
అటు నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ స్థాపించి వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఈ బ్యానర్ లో తెరకెక్కిన పలు సినిమాలు మంచి హిట్స్ అందుకున్నాయి. తాజాగా నాగవంశీ తెరకెక్కించిన ‘లక్కీ భాస్కర్’ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో పాల్గొన్న దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగవంశీలో ఒకప్పటి నన్ను నేను చూసుకున్నట్లు ఉందని చెప్పుకొచ్చారు. తన ఫెయిల్యూర్స్ అందరి ముందు ఒప్పుకున్నారు దిల్ రాజు.
“ఒకప్పుడు నేను చిన్న సినిమాలు, మిడ్ రేంజ్ సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టేవాడిని. కానీ, ఇప్పుడు ట్రాక్ తప్పాను. దానిని వంశీ కొనసాగిస్తున్నాడు. అందుకే, అతడిలో నన్ను నేను వెతుక్కుంటున్నాను” అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దిల్ రాజు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎలాంటి మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పడంలో దిల్ రాజు తర్వాతే మరెవరైనా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
సంక్రాంతి బరిలో దిల్ రాజు ‘గేమ్ ఛేంజర్’
దిల్ రాజు ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా, ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతిక కానుకగా విడుదలకానుంది. జనవరి 10 ఈ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నది. ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, అంజలి, సముద్రఖని, నవీన్ చంద్ర సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మెగా అభిమానులతో పాటు సినీ లవర్స్ ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Read Also: ఆ హీరోతో స్పెషల్ సాంగ్ చేయాలనుంది, అసలు విషయం చెప్పేసిన హన్సిక