Priyanka Chopra : సెలబ్రెటీలు అనగానే గుర్తొచ్చేది ముఖ్యంగా అందం, అభినయం, ఆహార్యం. ఈ మూడింటి సమ్మేళనమే ఒక ఆర్టిస్ట్ జీవితంలో అతి కీలకమైన పాత్రలు పోషిస్తాయి. ఏదైనా అకేషన్ లేదా పార్టీకి వెళ్లినా సెలబ్రెటీల వేషధారణ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటారు. ఎందుకంటే సమాజంలో తామొక మోస్ట్ పాపులప్ పర్సన్ గా వారు భావిస్తారు. అంతేకాదు న్యూ డిజైన్ లతో అందర్నీ ఆకట్టుకోవాలని, స్పెషల్ అట్రాక్షన్ గా నిలవాలని భావిస్తుంటారు. అదే తరహాలో గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా రెడీ అయ్యి వెళ్లారు. మామూలుగా కాదు.. ఓ స్పెషల్ థీమ్ తో.. స్పెషాలిటీ ఉన్న వేషధారణతో. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె షేర్ చేశారు. ఆ ఆహార్యానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఇటీవల ముంబైలో ప్రారంభమైన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవానికి అనేక మంది సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్, వరుణ్ ధావన్ లాంటి చాలా మంది అటెండ్ కావడంతో పాటు తమ టాలెంట్ ను ప్రదర్శించి, ఆకట్టుకున్నారు. అదే ఈవెంట్ కు నటి ప్రియాంక చోప్రా, ఆమె భర్త, నటుడు-గాయకుడు నిక్ జోనాస్ వెళ్లారు. మామూలుగా సెలబ్రెటీలు అనగానే కోట్ల విలువ చేసే కార్లలో వస్తూ ఉంటారు. కానీ ఈ జంట మాత్రం ఆటోలో ఈవెంట్ కు హాజరయ్యారు. లాస్ ఏంజిల్స్ నుండి ముంబైకి వెళ్లిన ఈ స్టార్ కపుల్ కాస్త ఆకర్షణీయంగా కనిపించారు. అందులో ముఖ్యంగా ప్రియాంక చోప్రా వేసుకున్న డ్రెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తోంది. ఈ డ్రెస్ కు సంబంధించిన డిటెయిల్స్ ను వర్ణిస్తూ, తన భర్తతో ఆటోలో నుంచి దిగుతున్న ఫొటోను ప్రియాంక చోప్రా షేర్ చేశారు.
తన భర్త నిక్ జోనాస్ తో డేట్ నైట్ కు వెళ్లానని, అది కూడా ఆటోలో అని తెలియజేసేలా ఆటో సింబల్ ను ప్రియాంక చోప్రా చేర్చారు. తనకు సహకారాన్ని అందించిన అమీ పటేల్ కు ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చారు. తన లాగే తన డ్రెస్సింగ్ తూర్పు, పడమరల సమ్మేళనంగా ఉండాలని పాత కాలపు దుస్తులు ధరిస్తానని తెలిపారు. తనకు ఇంతటి అందమైన హస్తకళా సౌందర్యంతో 65 ఏళ్ల పాతకాలపు బనారసీ పటోలా (బ్రోకేడ్) చీరను తయారు చేసినందుకు అమిత్ అగర్వాల్‌కు ఇన్ స్టా ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఖాదీ పట్టుపై బంగారంతో ఎలక్ట్రోప్లేటింగ్ చేశారన్నారు. దీనిపై అమర్చిన తొమ్మిది రంగుల ఇకత్ నేతను ప్రతిబింబించేలా ఉందంటూ ఆమె సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ సినిమాలతో పాపులారిటీతో పాటు ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రా.. 2017లో బేవాచ్ మూవీతో హాలీవుడ్‌లో అడుగుపెట్టింది. 2018లో తనకంటే చిన్నవాడైన పాప్ సింగర్ నిక్ జొనాస్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2022లో సరోగసి ద్వారా ఆడబిడ్డకు జన్మనిచ్చారు. పెళ్లి తర్వాత తన భర్త నిక్‌తో కలిసి లాస్ఏంజెల్స్‌లోనే సెటిల్ అయిన ప్రియాంక... రీసెంట్ గా ఇండియాకు వచ్చారు. ఇక ఆమె సినిమా విషయానికొస్తే.. హాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ ‘సిటాడెల్’. ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్ ను, అమెజాన్ సంస్థ గ్రాండ్ గా రూపొందిస్తోంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సిరీస్ ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సందర్భంలోనే ఏప్రిల్ 28న ఈ సిరీస్ స్ట్రీమింగ్ కు రానున్నట్లు అమెజాన్ ప్రైమ్ వెల్లడించింది.