ప్రియదర్శి.. ఈ పేరు వింటేనే మన మోముపై తెలియకుండానే చిరునవ్వు విరుస్తుంది కదూ. ముఖ్యంగా ‘‘నా సావు నేను చస్తా.. నీకెందుకు?’’ అనే డైలాగ్ వెంటనే గుర్తుకొచ్చేస్తుంది. ప్రియదర్శి కామెడీ చేస్తుంటే.. ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లు ఉండదు. గులాబీ మొక్కకు అంటు కట్టినట్లు పద్ధతిగా.. ఎంతో సహజంగా ప్రియదర్శి నటన ఉంటుంది. అతడి విసిరే పంచులే కాదు.. భావోద్వేగ సన్నివేశాలు సైతం ప్రేక్షకుడి గుండెను సుతిమెత్తగా తాకుతాయి. అతడి వాయిస్ వింటే చాలు.. మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. యానిమేటేడ్ సినిమా ‘ఫ్రోజెన్’లో మంచు బొమ్మకు మాటలిచ్చి భలే చక్కిలిగిలి పెట్టాడు. వరుస సినిమాలతోనే కాకుండా.. వెబ్‌సీరిస్‌లతో సైతం తన ప్రతిభను చాటుతున్న ప్రియదర్శికి టాలీవుడ్‌లో అవకాశాలు అంత ఈజీగా రాలేదు. సినిమాలపై ఉన్న పిచ్చి.. నటనలో ప్రతిభ.. అతడికి అవకాశాలను తెచ్చిపెట్టాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు (ఆగస్టు 26) ప్రియదర్శి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాక్షాంక్షలు చెబుతూ.. కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
ప్రియదర్శి హైదరాబాద్‌లో జన్మించాడు. ఆయన తండ్రి పులివకొండ సుబ్బాచారి ప్రొఫెసర్. ప్రియదర్శికి పదేళ్లు వచ్చే వరకు ఓల్డ్ వారి తల్లిదండ్రులు ఓల్డ్ సిటీలోనే ఉండేవారు. ఆ తర్వాత గచ్చిబౌలీ, ఇప్పుడు చందానగర్‌లో ఉంటున్నారు. ప్రియదర్శి భార్య రిచా నవలా రచయిత్రి కావడం గమనార్హం. ప్రియదర్శి.. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్స్‌లో పీజీ చేశాడు. ఆ తర్వాత సినిమాల వైపు ప్రయాణం మొదలుపెట్టాడు. అయితే, ప్రియదర్శి కెమేరా మ్యాన్‌గా అవ్వాలనుకుని సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడట. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ షార్ట్‌ఫిల్మ్ చేసేవాడు. ఆ తర్వాత నటనపై ఆసక్తి కలిగి.. కెమేరా ముందుకొచ్చాడు.
2016లో ‘టెర్రర్’ మూవీలో తీవ్రవాదిగా నటించాడు. అయితే, అతడి రెండో చిత్రం ‘పెళ్లి చూపులు’ ద్వారానే అసలైన గుర్తింపు లభించింది. ఆ తర్వాత ప్రియదర్శికి అవకాశాలు క్యూకట్టాయి. కేవలం కామెడీ క్యారెక్టర్లు, హీరో ఫ్రెండ్‌గానే స్థిరపడకుండా.. కొన్ని చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ తన ప్రతిభను చాటుతున్నాడు. ‘మల్లేశం’ సినిమాలో ప్రియదర్శి నటనకు మరిన్ని మంచి మార్కులు పడ్డాయి. ‘జాతిరత్నం’ సినిమాల్లో ఒక రత్నంగా నవ్వులు పూయించాడు. ‘మెయిల్’, ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ వంటి వెబ్ సీరిస్‌లతో కూడా ప్రియదర్శి ఆకట్టుకుంటున్నాడు.
Also Read: ‘బిగ్‌బాస్-5’ బిగ్ అప్‌డేట్: క్వారంటైన్‌లో కంటెస్టెంట్లు.. టెలికాస్ట్ తేదీ ఇదేనా?
ప్రియదర్శి.. రిచా శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే, యూనివర్శిటీలో చదువుకొనే రోజుల్లో రిచా ప్రియదర్శికి సీనియర్ కావడం విశేషం. 2018లో ఈ జంట పెళ్లితో ఒక్కటయ్యారు. ‘‘సినిమా తనకు జీవితమైతే.. తన జీవితం రిచా’’ అని ప్రియదర్శి ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. సినిమాల్లోకి వచ్చిన మొదట్లో ఆడిషన్స్‌కు వెళ్లేటప్పుడు బట్టలు కొనుక్కోడానికి తన భార్య రిచానే డబ్బులు ఇచ్చేదని ప్రియదర్శి తెలిపాడు. తన మొబైల్, ట్రావెల్ ఖర్చులను కూడా ఆమే భరించేందన్నాడు. ప్రియదర్శి నటించిన ‘ఇచ్చట వాహనాలు నిలుపురాదు’ విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తున్న ‘F3’, ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాల్లో ప్రియదర్శి నటిస్తున్నాడు.