గడిచిన కొద్ది రోజులుగా మలయాళీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పలు వార్తా సంస్థలు ఆయన గురించి కొన్ని కీలక వార్తలను ప్రసారం చేస్తున్నాయి. పశ్చిమాసియాకు చెందిన కొందరు వ్యక్తుల నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ డబ్బులు తీసుకుని ప్రమోషనల్ మూవీస్ నిర్మిస్తున్నారని, ఈ విషయంపై ఈడీ సీరియస్ అయ్యిందని ఆ వార్తల సారాంశం. అంతేకాదు, నింబధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు గాను ఈడీ ఆయనకు రూ. 25 కోట్ల జరిమానా విధించినట్లు మరునాడన్ మలయాళీ అనే యూట్యూబ్ ఛానెల్ పలు వార్తలను వండివార్చింది.
తప్పుడు వార్తలు ప్రసారం చేసిన ఛానెల్ పై పరువు నష్టం దావా
ఈ వార్తలపై పృథ్వీరాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా సుదీర్ఘ వివరణ ఇచ్చారు. సరైన సమాచారం లేకుండా, పూర్తి అవాస్తవాలతో తన పరువుకు భంగం కలిగించేలా కొంత మంది ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వార్తలు ప్రజల్లోకి తీసుకెళ్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే పలువురు న్యాయనిపుణులతో చర్చించినట్లు వెల్లడించారు. తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేలా తప్పుడు వార్తలు ప్రసారం చేసిన సదరు ఛానెల్ పై దావా వేయనున్నట్లు తెలిపారు. "నేను సాధారణంగా ఇలాంటి వార్తలను పట్టించుకోను. జర్నలిజం మీద నాకు చాలా గౌరవం ఉంది. కానీ, వార్తలు పేరుతో అబద్ధాలను ప్రచారం చేయడానికి ఒక పరిమితి ఉంది. ఆ పరిమితిని దాటి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. అందుకే వారికి తగిన గుణపాఠం చెప్పాలని భావిస్తున్నాను. క్రిమినల్ కేసులతో పాటు పరువు నష్టం దావా వేయాలని భావిస్తున్నాను” అని సుకుమార్ తెలిపారు.
ఇంతకీ ఏం జరిగిందంటే?
పృథ్వీరాజ్ సుకుమారన్ కొంత కాలంగా ప్రమోషన్ సినిమాలు తీస్తున్నారని, ఈ చిత్రాల నిర్మాణానికి డబ్బులు పశ్చిమాసియా దేశాల నుంచి అందుతున్నాయని మరునాడన్ మలయాళీ అనే యూట్యూబ్ ఛానెల్ వార్తలను ప్రసారం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సుకుమార్ ను ED రూ. 25 కోట్లు జరిమానా విధించినట్లు వార్తలు రాసింది. ఈ వార్తలపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. అవాస్తవాలను రాసి ప్రజలను తప్పుదోవ పట్టించకూడదని ఆయన కోరారు. సమాజంలో గౌరవంగా బతుకుతున్న వారి ప్రతిష్టకు భంగం కలిగించకూడదన్నారు. ఇప్పటికైనా ఆయా వార్తా సంస్థలు తప్పుడు వార్తలు ప్రసారం చేయడం మానుకోవాలని సూచించారు.
మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. 'అయ్యప్పనమ్ కోషియం', 'బ్రో డాడీ', 'లూసిఫర్', 'డ్రైవింగ్ లైసెన్స్', 'జనగణమన' వంటి విభిన్న చిత్రాలతో పృథ్వీరాజ్ సుకుమారన్ మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ మూవీ 'సలార్'లో పృథ్వీరాజ్ కీలకపాత్ర పోషిస్తున్నారు.
Read Also: ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ విన్ అయినప్పుడు భర్తకు ఏడేళ్లు, టీవీలో ప్రోగ్రామ్ చూసిన నిక్