కన్నడ నటుడు దేవరాజ్(Actor Devaraj) తెలుగులోనూ నటించారు. చిరంజీవి 'ఎస్పీ పరశురామ్', నందమూరి బాలకృష్ణ 'బంగారు బుల్లోడు', 'సమరసింహారెడ్డి', నాగార్జున 'నేటి సిద్ధార్థ', గోపీచంద్ 'యజ్ఞం', 'లక్ష్యం' సినిమాల్లో మంచి పాత్రలు పోషించారు. మహేష్ బాబు 'భరత్ అనే నేను'లో ప్రతిపక్ష పార్టీ నేతగా ఆయన కనిపించారు. ఇప్పుడు ఆయన తనయుడు ప్రణం దేవరాజ్ తెలుగు మీద ఫుల్ ఫోకస్ చేశారు. వరుస సినిమాలు చేస్తున్నారు.
ప్రణం దేవరాజ్ హీరోగా కొత్త సినిమా షురూ
Pranam Devaraj New Movie In Telugu: ప్రణం దేవరాజ్ ప్రధాన పాత్రలో శంకర్ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రూపొందుతోంది. హరి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1గా పి హరికృష్ణ గౌడ్ నిర్మిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ రోజు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
ముహూర్తపు సన్నివేశానికి దేవరాజ్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా... యువ హీరో, ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ క్లాప్ ఇచ్చారు. ప్రముఖ నటుడు, దర్శక - రచయిత తనికెళ్ళ భరణి గౌరవ దర్శకత్వం వహించారు. పూజ తర్వాత చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందజేశారు.
Also Read: మహేష్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్... నటుడిగా వేణు స్వామి ఫ్లాప్ షో, అందుకే, ఇండస్ట్రీ మీద పడ్డారా?
తెలుగులో నా మూడో చిత్రమిది
హీరో ప్రణం దేవరాజ్ మాట్లాడుతూ... ''తెలుగులో నా మూడో చిత్రమిది. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్, ప్రేమ, యాక్షన్ కథలో ఉన్నాయి. తెలుగు ప్రేక్షకుల ప్రోత్సాహం నాకు కావాలి'' అని అన్నారు. దేవరాజ్ మాట్లాడుతూ... ''దర్శకుడు శంకర్ అద్భుతమైన కథ రాసుకున్నారు. ఆయన చెప్పిన కథ చాలా బావుంది. హరి గౌడ్ మంచి అభిరుచి ఉన్న నిర్మాత. ఈ సినిమా తప్పకుండా విజయవంతం అవుతుందనే నమ్మకం ఉంది'' అని అన్నారు.
Also Read: ఆ ఓటీటీలో, టీవీలో 'నా సామి రంగ'... డీల్ సెట్ చేసిన కింగ్ నాగార్జున
తెలుగులోనూ ప్రణం పేరు తెచ్చుకోవాలి
తనికెళ్ళ భరణి మాట్లాడుతూ... ''దేవరాజు గారు పాన్ ఇండియా నటుడు. ఆయన నటనకు మెచ్చి ఎన్నో అవార్డులు వరించాయి. ఆయన వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ వాళ్ళబ్బాయి ప్రణం దేవరాజ్ సినిమాల్లోకి రావడం చాలా సంతోషంగా ఉంది. అతను ఇప్పటికే కన్నడలో మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగులోనూ పేరు తెచ్చుకోవాలని ఆశీర్వదిస్తున్నాను. శంకర్ ప్రతిభ ఉన్న దర్శకుడు. ఈ సినిమా పెద్ద విజయం సాధించి అందరికీ పేరు ప్రతిష్టలు రావాలి'' అని అన్నారు.
దర్శకుడు శంకర్ మాట్లాడుతూ... ''దర్శకుడిగా నా మొదటి సినిమా ఇది. అవకాశం ఇచ్చిన నిర్మాత హరి గౌడ్ గారికి థాంక్స్. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న కుటుంబ కథా చిత్రమిది. తెలుగు, కన్నడ భాషల్లో సినిమా తీస్తున్నాం. జనవరి మూడో వారంలో హైదరాబాద్ సిటీలో మొదటి షెడ్యూల్, ఆ తర్వాత విశాఖలో నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తాం'' అని అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ... ''ఇది మా ఫస్ట్ ప్రొడక్షన్. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన తనికెళ్ళ భరణి, నరసింహా రెడ్డి, ఆకాష్ పూరి, దేవరాజ్ గారికి థాంక్స్'' అని చెప్పారు.
Also Read: 'మిస్ పర్ఫెక్ట్'గా మెగా కోడలు లావణ్య - పెళ్లైన తర్వాత కుమారిగా
ప్రణం దేవరాజ్ హీరోగా సుమన్, రవి శివతేజ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విశ్వ తేజ, కాస్ట్యూమ్స్: అన్నపూర్ణ, పోరాటాలు: నటరాజన్, కళా దర్శకత్వం: గురు మురళీకృష్ణ, నృత్య దర్శకత్వం: జిత్తు మాస్టర్, కూర్పు: శ్రీ వర్కాల, ఛాయాగ్రహణం: బాల సరస్వతి, సంగీతం: శేఖర్ చంద్ర, నిర్మాత: పి హరికృష్ణ గౌడ్, రచన - దర్శకత్వం: శంకర్.