మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో మోహన్ బాబు, వీకే నరేష్ తమ ప్యానల్ సభ్యులపై దాడి చేశారని, ఇందుకు సీసీటీవీ వీడియోలే సాక్ష్యమంటూ ప్రకాష్ రాజ్.. ఎన్నికల అధికారిని ఆశ్రయించారు. అయితే, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు అందుబాటులో లేకపోవడం వల్ల వాటిని మీకు చూపించలేమని, ఇరువురి సమక్షంలో మాత్రమే ఆ వీడియోలను చూపిస్తామని అంటున్నారు. ఇందుకు కోర్టు అనుమతి కూడా తెచ్చుకోవాలని ఎన్నికల అధికారి సూచించినట్లు తెలిసింది.
మంచు విష్ణు దీనిపై స్పందిస్తూ.. ‘‘ఎన్నికలు ప్రజాస్వామ్యబద్దంగానే సాగాయి. ప్రకాష్ రాజ్ సీసీటీవీ వీడియోలు చూడవచ్చు’’ అని తెలిపారు. దీంతో ప్రకాష్ రాజ్ సోమవారం తమ ప్యానల్ సభ్యులతో కలిసి జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్‌కు చేరుకున్నారు. సీసీటీవీ వీడియోలు చూపించాలని పట్టుబట్టారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫూటేజీలను చూసేందుకు అనుమతి ఇవ్వలేదు. అయితే, పబ్లిక్‌లో దీనిపై రచ్చ కాకూడదనే ఉద్దేశంతో ప్రకాష్ రాజ్ టీమ్‌ను ‘మా’ స్కూల్ లోపలికి తీసుకెళ్లారు. ప్రస్తుతం విష్ణు టీమ్ తిరుపతిలో ఉన్న నేపథ్యంలో వీడియోలను పరిశీలించడం కుదరదని పోలీసులు తొలుత నిరాకరించారు. విష్ణు అనుమతి ఇవ్వడంతో ప్రకాష్ రాజ్.. పోలీసుల సమక్షంలోనే ఆ వీడియోలను చూశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
విష్ణుకు థాంక్స్.. ప్రకాష్ రాజ్: ‘‘ఎన్నికల నిర్వహణపై మాకు అనుమానాలు ఉన్నాయి. అందుకే నేను సీసీటీవీ ఫూటేజ్ కావాలని కోరాను. స్కూల్ సీసీటీవీ కెమేరాల్లో రికార్డైన వీడియోలను పరిశీలించాను. ఇవి కాకుండా ఎన్నికల అధికారి వద్ద మరో ఏడు సీసీటీవీ వీడియోలు ఉన్నాయి. వాటిని ఇవ్వాలని కోరగా.. ఆయన స్పందించడం లేదు. కేవలం మీడియాతోనే మాట్లాడుతున్నారు. సీసీటీవీ వీడియోలు పరిశీలించేందుకు అనుమతి ఇచ్చిన విష్ణుకు థాంక్స్. నాకు విష్ణుతో సమస్య లేదు. కేవలం ఈసీతోనే. మరో వారం తర్వాత మళ్లీ దీనిపై మాట్లాడతాం’’ అని ప్రకాష్ రాజ్ అన్నారు.
Also Read: పెళ్లి సందD హీరోయిన్ నా కూతురు కాదు.. ఆస్తి కోసమే అలా.. సంచలన వ్యాఖ్యలు!
‘మా’ ఎన్నికల్లో ఈసీగా వ్యవహరించిన కృష్ణమోహన్ స్పందిస్తూ.. ఎన్నికలు ముగిసిన తర్వాతే తన బాధ్యతలు పూర్తయ్యాయని తెలిపారు. ఆ వీడియోలు చూసేందుకు అనుమతి ఇచ్చే అధికారం తనకు లేదన్నారు. ఒక వేళ అవి కావాలంటే కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకోవాలని అన్నారు. పోలింగ్ సమయంలో మోహన్ బాబు, నరేష్ వర్గం తమపై దాడి చేశారని, దానికి సాక్ష్యంగా సీసీటీవీ కెమెరా వీడియోలు కూడా ఉన్నాయని ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌కు ప్రకాష్ రాజ్ లేఖ రాశారు. దీంతో ఆదివారం పోలీసులు రంగంలోకి దిగి.. ‘మా’ కార్యాలయంలోని సర్వర్ రూమ్‌కు తాళాలు వేశారు. అయితే, ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు దాడిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఆ వీడియోలను మీడియా ముందు పెట్టి.. ఎన్నికల్లో ఏం జరిగిందో చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: చేసింది చాలు రెచ్చగొట్టొద్దు .. మోహన్ బాబు కామెంట్స్ వైరల్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి