రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఆ సిరీస్ తర్వాత వరుసగా పాన్ ఇండియన్ చిత్రాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత ఆయన చేసిన ఏ మూవీ కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ’సాహో’, ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’ బాక్సాఫీస్ దగ్గర చతికిలబడ్డాయి. త్వరలో ‘సలార్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు. ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. హొంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనలు జరుపుకుంటోంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ, ఆ తర్వాత పోస్ట్ పోన్ చేశారు. సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం, దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. 


4 నెలల పాటు సినిమాలకు ప్రభాస్ దూరం  


తాజాగా ప్రభాస్ కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. ప్రస్తుతం ఆయన మోకాలి సర్జరీ కోసం యూరప్ వెళ్లినట్లు తెలుస్తోంది. సుమారు రెండు నెలల పాటు ఆయన అక్కడే ఉండే అవకాశం ఉంది. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత 6 నుంచి 7 వారాల పాటు రెస్ట్ తీసుకుంటారట. అంటే వచ్చే 4 నెలల పాటు ఆయన సినిమాలకు దూరంగా ఉండనున్నారు. 2024లో సినిమా సెట్స్ లోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘సలార్‘ షూటింగ్ కంప్లీట్ కాగా,  ‘కల్కి 2898 AD’ షూటింగ్స్  కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. సర్జరీ తర్వాతే కొత్త సినిమాలను ప్రభాస్ టేకప్ చేయనున్నట్లు టాక్ నడుస్తోంది.


వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీ


అటు దర్శకుడు నాగ్ అశ్విన్ తో కలిసి ప్రభాస్ చేస్తున్న ‘కల్కి 2898 AD’ మూవీ పైనా భారీగా అంచనాలు నెలకొన్నాయి. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె వంటి భారీ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.  వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 12న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ముందుగా ప్రకటించారు. అయితే, ఈ సినిమా మే నెల 9కి వాయిదా వేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు దర్శకుడు మారుతితో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. అటు సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్‌’ అనే సినిమా ప్రకటించారు. ఈ చిత్రానికి భూషణ్‌ కుమార్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘యానిమల్‌’ విడుదలైన తర్వాత ‘స్పిరిట్‌ సినిమా పనులు మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జూన్‌లో ‘స్పిరిట్‌’ చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయంటూ టాక్‌ వినిపిస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాలో ప్రభాస్‌ పోలీసు ఆఫీసర్ గా కనిపించనున్నట్లు సమాచారం. అటు మంచు విష్ణు ‘భక్త కన్నప్ప‘ చిత్రంలో శివుడి పాత్రలో ప్రభాస్ నటిస్తారనే టాక్ వినిపిస్తోంది.


Read Also: ఎన్టీఆర్ బావమరిది సినిమా వాయిదా - ఆ రోజు 'మ్యాడ్' రావడం లేదు!



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial