SS Rajamouli About Prasbhs: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’. ఈ మూవీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రేపు (డిసెంబర్ 22న) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజిలో కొనసాగుతున్నాయి. అనుకున్న స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలు లేకపోయినా, ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే, సరిగ్గా సినిమా విడుదలకు రెండు రోజుల ముందు  హీరో ప్రభాస్‌, డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌, మళయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌ తో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఓ ఇంటర్వ్యూ చేశారు. ఇందులో పలు కీలక విషయాలు వెల్లడించారు. ‘సలార్’ సినిమాకు ఈ ఇంటర్వ్యూ బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

  


ప్రభాస్ తెలివి తక్కువ వాడిలా కనిపించే తెలివైన వాడు- రాజమౌళి


ఇక ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి దర్శకుడు రాజమౌళి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూలో భాగంగా ప్రభాస్ తనకు ఏది ఇచ్చినా, ఎటువంటి కరెక్షన్లు చేయనని ప్రశాంత్ నీల్ చెప్పారు. అతడు ఇంత కరెక్టుగా ఉంటాడా? అనిపిస్తుందని వెల్లడించారు. ఈ సమయంలో రాజమౌళి కలుగజేసుకుంటూ,  ప్రభాస్ తెలివి తక్కువ వ్యక్తిగా కనిపిస్తాడని, కానీ, ఆయన చాలా తెలివైన వాడని చెప్పుకొచ్చారు. డ్రామా అనేది ప్రభాస్‌తో బాగా వర్కవుట్ అవుతుందని చెప్పారు.. దాని గురించి అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నారు. ప్రభాస్ అలా వచ్చి నిల్చుంటే  డ్రామా ఎంతసేపు అయినా జనాలు చూస్తూనే ఉంటారని చెప్పారు. ప్రభాస్‌ కు అదే పెద్ద ప్లస్ పాయింట్ అన్నారు. వెంటనే ప్రభాస్ ‘బాహుబలి 3’ నాతో కన్ఫార్మ్ కదా అనగానే... జక్కన్న షాకైనా, ఎలాంటి సమాధానం చెప్పకుండా విషయాన్ని డైవర్ట్ చేయడం విశేషం.


‘సలార్’ విషయంలో చాలా టెన్షన్ ఉంది- ప్రశాంత్


ఇక ‘సలార్’ సినిమా గురించి ప్రశాంత్ నీల్ కీలక విషయాలు వెల్లడించారు. “ఇప్పటి వరకు నేను 4 సినిమాలు తీశాను. ఏ సినిమా రిలీజ్ విషయంలో ఇంత టెన్షన్ కలగలేదు. ‘సలార్’ మూవీలో డ్రామా చాలా ఎక్కువగా ఉంటుంది. నేను ఏ సినిమాలోనూ ఇంత డ్రామాను చూపించలేదు. నా సినిమాలో ఈ డ్రామా ఎలా వర్కౌట్ అవుతుందో అనే టెన్షన్ కలుగుతోంది. ఇక ప్రభాస్ నా స్ర్కిప్ట్ మీద చాలా ప్రశంసలు కురిపించారు. డైలాగులు చాలా అద్భుతంగా ఉన్నాయని పొగిడిన సందర్భాలున్నాయి” అని చెప్పుకొచ్చారు.  


ప్రభాస్ అలా నమ్మిస్తారు- పృథ్వీరాజ్


నిజానికి తనకు ఏమీ తెలియదని ఎదుటి వారిని నమ్మించే ప్రయత్నం ప్రభాస్ చేస్తారని పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు. ప్రేక్షకులను అలరించడానికి ఇతర నటీనటులు చాలా కష్టపడాల్సి ఉంటుంది. కానీ, రాజమౌళి చెప్పినట్లుగానే ప్రభాస్ తెర మీద కనిపిస్తే ప్రేక్షకులు అలా చూస్తూ ఉండిపోతారని చెప్పారు. ‘సలార్’ మూవీ డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు, తమిళం, మలయాళంతో పాటు హిందీలోనూ ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా, ఈశ్వరీ రావు, బాబీ సింహా  కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Read Also: వైఎస్ జగన్ బర్త్ డే స్పెషల్, ‘యాత్ర 2‘ నుంచి అదిరిపోయే పోస్టర్ విడుదల