Salaar Advance Booking: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో విడుదలైన తాజా చిత్రం ‘సలార్‘. ‘కేజీఎఫ్‘, ‘కేజీఎఫ్2‘ సినిమాల తర్వాత హొంబలే ఫిల్మ్స్ నుంచి వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. సౌత్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

  


అడ్వాన్స్ బుకింగ్స్ లో ‘సలార్’ జోరు


‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు కొనసాగిస్తోంది. ఓవర్సీస్‌ తో పాటు దేశ వ్యాప్తంగా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తున్నది. Sacnilk.comలో నివేదిక ప్రకారం, ఈ చిత్రం తొలి రోజు ₹48.94 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు చేసింది. 16,593 షోలకు 22 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఇందులో కేవలం తెలుగు షోలకే రూ.38.25 కోట్ల విలువైన 17 లక్షల టిక్కెట్లు బుక్ అయ్యాయి. 


హిందీ షో రూ.5.62 కోట్ల విలువైన 2 లక్షలకు పైగా టిక్కెట్లు సేల్ అయ్యాయి. తమిళ షోలకు రూ.1.9 కోట్ల టిక్కెట్లు సినిమా విడుదలకు ముందే అమ్ముడయ్యాయి. ఓవర్సీస్‌ లో 2 మిలియన్ డాలర్లు అంటే, భారత కరెన్సీలో రూ.16 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. తొలి రోజు ‘సలార్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.   


‘సలార్’ వర్సెస్ ‘డుంకీ’ వివాదం


గత కొద్ది రోజులుగా స్క్రీన్స్ విషయంలో ‘సలార్’, ‘డుంకీ’ మధ్య వివాదం కొనసాగుతోంది. నార్త్ ఇండియాలో పీవీఆర్, ఐనాక్స్ సంస్థలు ‘సలార్’కు ఎక్కువ స్క్రీన్స్ ఇవ్వకుండా, ‘డుంకీ’కి ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ‘సలార్’ నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు.


నార్త్‌లో తమ సినిమాకు తగిన స్క్రీన్స్ ఇవ్వకపోతే, అసలు సౌత్ లో వాళ్లకు తమ సినిమానే ఇవ్వకూడదనే నిర్ణయానికి వచ్చారు. దీంతో పీవీఆర్, ఐనాక్స్ యాజమాన్యాలు దిగిరాక తప్పలేదు. ‘సలార్’ నిర్మాతల డిమాండ్లకు అనుకూలంగా వ్యవహరించాలనే నిర్ణయానికి వచ్చాయి. చిత్ర నిర్మాణ సంస్థతో ఎలాంటి సమస్యలు లేవని వెల్లడించాయి.  అనుకున్న సమయానికే ‘సలార్’ విడుదల అవుతుందని ప్రకటించాయి. దేశ వ్యాప్తంగా బుకింగ్స్ మొదలు పెట్టాయి.


‘సలార్’ మూవీ గురించి..


ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు, జగపతి బాబు, శ్రియా రెడ్డి, బాబీ సింహా, రామచంద్రరాజు, మైమ్ గోపి, ఝాన్సీ, టినూ ఆనంద్ కీలక పాత్రలు పోషించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.






Read Also: అందుకే రణబీర్, బాబీ కిస్ సీన్ తొలగించాం, అసలు విషయం చెప్పిన సందీప్ వంగా