Cold waves in Telangana: హూ.. గజ... గజ... తెలంగాణలో రాత్రి అయితే చాలు... కాదు కాదు సాయంత్రం అయితే చాలు.. ప్రతి ఒక్కరి పరిస్థితి ఇదే. ఇళ్లలో ఉన్నవారు  కూడా చలికి వణికిపోతున్నారు. ఇక... బయట తిరిగి వారి పరిస్థితి.. మాటల్లో చెప్పలేం. చలిని తట్టుకునేందుకు స్వెట్టర్లు వేసుకున్నా సరే... గజగజా వణకాల్సి వస్తోంది.  చలిగాలులకు స్వెట్టర్లు కూడా ఆగడంలేదు. సాయంత్రం అవుతూనే చలిగాలులు మొదలవుతున్నాయి.. ఆరు గంటల దాటిన తర్వాత వణుకు మొదలవుతుంది. ఇంట్లో ఉంటేనే చలిని తట్టుకోలేకపోతున్నారు ప్రజలు. ఇక.. బయట తిరిగేవారి పరిస్థితి అయితే.. ఏ శీతల మండలంలోనో ఉన్నట్టు అనిపిస్తోంది. తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి  మరీ విపరీతంగా ఉంది. 


తెలంగాణలో రోజురోజుకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలతో.. చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతూనే ఉంది. రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. బుధవారం రాత్రి రాష్ట్రంలో  19 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లో 10 నుంచి 15 డిగ్రీల వరకు నమోదయ్యాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్‌లో  అత్యల్పంగా 6.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌లోని జైనథ్‌లో 7.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. హైదరాబాద్‌లో 10.7 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్‌ అయ్యింది. అంటే.. చలిగాలుల  తీవ్రత ఎంతగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు.. పెరుగుతున్న చలిగాలులకు... ప్రజలు వణికపోతున్నారు. అంతేకాదు... ఇంకొన్నిరోజులు ఇదే  పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ చెప్తుండటంతో... భయపడిపోతున్నారు. ఈ చలిని తట్టుకోవడం మా వల్ల కాదు బాబోయ్‌ అంటూ.... దుప్పట్లు, రగ్గులు.. కప్పుకుని  ఇళ్లకే పరిమితమవుతున్నారు. వృద్ధుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఇక చిన్నపిల్లలు అయితే... జలుబు, దగ్గు, జ్వరం బారిన పడుతున్నారు. 


ఉదయం, సాయంత్రం వేళల్లో పొగ మంచు ఉండటం వల్ల ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. పాఠశాలలకు వెళ్లే చిన్నారులు సైతం ఉదయం చలికి  తట్టుకోలేక పోతున్నారు. తెల్లవారుతూనే పనులు మొదలుపెట్టే పాల వ్యాపారులు, పేపర్‌ బాయ్‌ కూడా చలితో వణికిపోతున్నారు. సాయంత్రం అయ్యిందటే చాలు.. చలిని  తట్టుకునేందుకు పలు కాలనీల్లో చలిమంటలు వేసుకుంటున్నారు. 


ఉత్తర తెలంగాణలోనే చలి తీవ్రత అధికంగా ఉందని అధికారులు చెప్తున్నారు. అక్కడ అన్ని జిల్లాల్లో అల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో మూడు రోజుల్లో చలి తీవ్రత  అలాగే ఉంటుందని... పైగా ఉష్ణోగ్రతలు ఇంకా పడిపోతాయని చెప్తున్నారు. దీంతో చలి మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఉత్తర, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల  కారణంగా చలి ప్రభావం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ కాలంలో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో... పిల్లలు, వృద్ధులు, గర్భిణులు తగిన  జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.