పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ ఫిల్మ్ 'హరి హర వీర మల్లు'. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయినా, ఇప్పటికీ కంప్లీట్ కాలేదు. సుమారు 75 శాతం షూటింగ్ పూర్తి కాగా, 25 శాతం పెండింగ్ లో ఉంది. ఈ సినిమా కంప్లీట్ కావాలంటే కనీసం నెల రోజుల సమయం కేటాయించాల్సి ఉంటుంది. అయితే, పవన్ కల్యాణ్ పలు సినిమాతో బిజీ అయ్యారు. సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ‘, హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్, సాయి ధరమ్ తేజ్‌తో ఒక చిత్రం చేస్తున్నారు.  


రెండు భాగాలుగా ‘హరిహర వీరమల్లు‘ విడుదల?


ప్రస్తుతం పవన్ కల్యాణ్ ‘ఓజీ‘ సెకెండ్ షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఫుణెలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. పలు పాటలు చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ కంప్లీట్ కాగానే, ‘ఉస్తాద్ భగత్ సింగ్‘ సినిమా సెకెండ్ షెడ్యూల్ లో పాల్గొననున్నారు. ‘హరిహర వీరమల్లు‘కు ఇప్పట్లో డేట్స్ ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో దర్శకుడు క్రిష్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో మొదటి భాగాన్ని విడుదల చేయాలనుకుంటున్నారట. స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి మిగతా షూటింగ్ కంప్లీట్ అయ్యాక రెండో భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనుకుంటున్నారట. ఈ నిర్ణయానికి పవన్ ఓకే చెప్పాల్సి ఉందట. ఆయన నిర్ణయం మీద ఆధారపడి సినిమా రెండు భాగాలుగా విడుదల కావాలా? వద్దా? అని క్రిష్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.






ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్    


ఇక 'హరి హర వీరమల్లు' సినిమాలో ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. అయితే, బాబీ డియోల్‌కు తొలి తెలుగు చిత్రమిది. ఇంతకు ముందు ఆయన చేసిన కొన్ని హిందీ చిత్రాలు తెలుగులో అనువాదం అయ్యాయి. అలాగే, ఓ వెబ్ సిరీస్ కూడా! ఇప్పుడు పవన్ సినిమాతో నేరుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.    


'హరి హర వీరమల్లు'లో పవన్ కల్యాణ్ సరసన నిధీ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ భామ నర్గిస్ ఫక్రి   కీలక పాత్రలో కనిపించనున్నారు. తెలుగు అమ్మాయి పూజితా పొన్నాడ కూడా ఓ రోల్ చేస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు.  


Read Also: ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసం రూ. 35 కోట్లు ఖర్చు - సల్మాన్, షారుఖ్ కాంబో అంటే ఆ మాత్రం ఉండదా మరి!