గత కొంతకాలంగా బాలీవుడ్ సినిమాలు అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కావడం లేదు. టాప్ హీరోలు నటించిన చిత్రాలు సైతం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. రీసెంట్ గా షారుఖ్ నటించిన ‘పఠాన్’ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఇటీవల విడుదలైన సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ చిత్రం కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో సల్మాన్ తదుపరి మూవీగా ‘టైగర్ 3’ తెరకెక్కుతోంది. ఇందులో షారుఖ్ కూడా కీలక పాత్ర పోషించబోతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.


రూ. 35 కోట్లతో సల్మాన్, షారుఖ్ యాక్షన్ సీక్వెన్స్


ఇప్పటి వరకు రిలీజ్ అయిన ‘టైగర్’ సిరీస్ లో రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. ‘ఏక్ థా టైగర్’ పేరుతో తొలి సినిమా 2012లో విడుదలైంది. దానికి సీక్వెల్ గా 2017లో ‘టైగర్ జిందా హై’ రూపొందింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపాయి. రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. ఇప్పుడు ఆ రెండు చిత్రాలకు మించి అనే రీతిలో ‘టైగర్ ౩’ రూపొందిస్తున్నారు. ఇందులో సల్మాన్ ఖాన్ తో పాటు షారుఖ్ నటించడంతో సినిమాకు భారీ హైప్ వచ్చేసింది. ఈ మూవీ పూర్తి స్థాయిలో స్పై యాక్షన్ చిత్రంగా రూపొందుతోంది. ఇందులో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. సల్మాన్, షారుఖ్ మధ్య యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలవబోతున్నాయట. వీరిద్దరి మధ్య యాక్షన్ సన్నివేశాల కోసం నిర్మాత ఏకంగా రూ. 35 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక సెట్ లో ఈ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించనున్నట్లు టాక్.  సుమారు 15 రోజుల పాటు ఈ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం.    


ఈ ఏడాది దీపావళికి ‘టైగర్ 3’ విడుదల!


‘టైగర్ 3’ చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మే 8 నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ మొదలుకానుంది.  ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు. సల్మాన్ ఖాన్ తో పొడుగు కాళ్ల సుందరి కత్రీనా కైఫ్ జోడీ కడుతోంది.  ఈ ఏడాది దీపావళి కానుకగా ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది.


ఇటీవలే ‘ఇటీవలే కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు  సల్మాన్ ఖాన్.  ఈ చిత్రంలో  పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా, వెంకటేశ్, భూమిక కీలకపాత్రలు పోషించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది. ఇంకా చెప్పాలంటే డిజాస్టర్ గా మిగిలింది. గత కొంత కాలంగా వరుసగా పరాజయాలు పొందుతున్న సల్మాన్ ఈ మూవీతోనైనా హిట్ అందుకుంటారేమో చూడాలి.


Read Also: షారుఖ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్, ‘జవాన్’ విడుదల వాయిదా, కారణం ఏంటంటే?