‘వాల్తేరు వీరయ్య’ సినిమా నుంచి నాలుగో పాట ‘పూనకాలు లోడింగ్’ వచ్చేసింది. ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహరాజ్ కలిసి కనిపించారు. ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్న పాట ఇదే. ‘డోంట్ స్టాప్ డ్యాన్సింగ్ పూనకాలు లోడింగ్’ అనే హుక్ లైన్ తో, మాస్ స్టెప్పులతో చిరంజీవి, రవితేజ అదరగొట్టారు.


రోల్ రైడా రాసి పాడిన ఈ పాటలో రామ్ మిరియాల కూడా స్వరం కలపగా చిరంజీవి, రవితేజ డైలాగులు చెప్పారు. ఎప్పుడో అప్పుడెప్పుడో శంకర్ దాదా ఎంబీబీఎస్, జిందాబాద్ సినిమాల కోసం సినిమాల మధ్యలో డైలాగులు చెప్పిన చిరంజీవి మళ్లీ ఇన్నాళ్లకు వాల్తే ర్ వీరయ్య కోసం హుక్ లైన్స్ ను రవితేజతో కలిసి పాడారు.


ఇక చిరంజీవి మాస్ స్టెప్పుల గురించి ఏం చెప్పాలి. బూరలు ఊదుతూ, పూనకాలు వచ్చినట్లు చిరంజీవి వేసిన స్టెప్పులు వింటేజ్ మెగాస్టార్ ను గుర్తు చేయక మానవు. కాస్టూమ్స్, ప్రొడక్షన్ వర్క్, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అంతా కూడా 90ల నాటి చిరంజీవికి ట్రిబ్యూట్ ఇవ్వటానికే అన్నట్లు ఉంది. ఇక థియేటర్లలో ఈ సాంగ్ ఇంకెన్ని పూనకాలు తెప్పిస్తుందో చూడాలి.


వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్‌ను కూడా చిత్ర బృందం ఇటీవలే విడుదల చేసింది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు పవర్ ఫుల్ ట్యూన్ ఇచ్చారు. ఏదో ఒక పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లో ఈ పాట రానుందని మాత్రం అర్థం చేసుకోవచ్చు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా, అనురాగ్ కులకర్థి ఆలపించారు.


ఇప్పటికే ‘నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి అవుతా’,‘బాస్ పార్టీ’ పాటలు విడుదలై చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ‘శ్రీదేవి, చిరంజీవి’ పాటను జస్‌ప్రీత్ జాజ్, సమీరా భరద్వాజ్ ఆలపించారు. బాస్ పార్టీ తరహలోనే దీనికి కూడా లిరిక్స్‌ను దేవిశ్రీ ప్రసాద్‌నే అందించారు. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 13వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చిరంజీవి సరసన శ్రుతి హాసన్, రవితేజ సరసన కేథరిన్ ట్రెసా జంటగా నటించారు.


‘నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి అవుతా’ పాటను సౌత్ ఆఫ్ ఫ్రాన్స్ లో స్విట్జర్లాండ్-ఇటలీ బోర్డర్ లో ఉన్న ఆల్ప్స్ మౌంటెన్ లోయలో చిత్రీకరించారని చిరంజీవి చెప్పారు. అక్కడి లోయలో లొకేషన్స్ చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయని, ఆ లోయ అందాలు చూసి తాను కూడా చాలా ఎగ్జైట్ అయ్యానని అన్నారు.