టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే బాలీవుడ్ లోనూ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో కలిసి ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ చిత్రంలో నటిస్తోంది. ఇందులో వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రామ్ చరణ్ సైతం అతిథి పాత్ర పోషిస్తున్నారు. అయితే, పూజా హెగ్డే సల్మాన్ తో సినిమా మొదలైనప్పటి నుంచి ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ బుట్టబొమ్మ సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై పూజా స్పందించింది. ఆమె ప్రస్తుతం ఒంటరిగానే ఉన్నట్లు వెల్లడించింది.
నిజానికి సల్మాన్, పూజా హెడ్గేల డేటింగ్ పుకార్లు కొద్ది నెలల క్రితమే ప్రారంభం అయ్యాయి. అయితే, ఈ వార్తలపై ఇటు సల్మాన్, అటు పూజా ఇంత కాలం స్పందించలేదు. తాజాగా పూజా సోదరుడు రిషబ్ హెగ్డే పెళ్లికి సల్మాన్ ఖాన్ హాజరయ్యారు. మంగళూరులో జరిగిన ఈ వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత డేటింగ్ రూమర్లు మరింత బలపడ్డాయి. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేసి కామెంట్స్ చేస్తున్నారు.
ఆ రూమర్ల గురించి నేను ఏమి చెప్పగలను? - పూజా హెగ్డే
తాజాగా సల్మాన్ తో డేటింగ్ వార్తలపై పూజా స్పందించింది. ఆయనతో తాను ఎలాంటి రిలేషన్ షిప్ లో లేనని వెల్లడించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ విషయాన్ని ప్రస్తావించింది. “డేటింగ్ రూమర్ల గురించి నేను ఏమి చెప్పగలను? నా గురించి సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లను చదువుతూ ఉంటాను. నేను ఒంటరిగా ఉన్నాను. నేను ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడతాను. నేను ప్రస్తుతం నా కెరీర్‌పైనే దృష్టి సారిస్తున్నాను. ఈ పుకార్ల గురించి స్పందించేందుకు ఏమీ లేదు” అని పూజా వెల్లడించింది.
అందుకే ఈ సినిమా నచ్చింది- పూజా హెగ్డే
ఇక ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ చిత్రం గురించి కూడా పలు విషయాలు వెల్లడించింది. "లాక్‌డౌన్‌కు ముందు ఈ చిత్రం నా దగ్గరకు వచ్చింది. టైటిల్ భిన్నంగా ఉంది. నా చిత్రం ‘మొహెంజొదారో’ చూసిన తర్వాత, సల్మాన్ సర్ తన సినిమాలో అవకాశం ఇస్తారని తెలిసింది. అనుకున్నట్లుగానే ఈ సినిమాలో అవకాశం వచ్చింది. ఇందులో నా క్యారెక్టర్ తెలుగు అమ్మాయి పాత్ర. అందుకే సినిమాలో బాగా నప్పింది. నేను తెలుగులో చాలా సినిమాలు చేశాను. ఈ సినిమా నాకు చాలా సూట్ అయ్యింది. సల్మాన్ ఖాన్ చిత్రంలో నాకు ఇంత ముఖ్యమైన పాత్ర లభించడం సంతోషంగా ఉంది” అని చెప్పుకొచ్చింది.
సల్మాన్ తో పని చేయడం గొప్పగా ఉంది- పూజా హెగ్డే
ఇక సల్మాన్ తో కలిసి పని చేయడం ఆనందంగా ఉందని చెప్పింది. "నాకు అతడితో పని చేయడం చాలా గొప్పగా అనిపించింది. తను బయట ఎలా ఉంటారో సెట్స్ లో కూడా అలాగే ఉంటారు. ఎదుటి వారితో చాలా పద్దతిగా మాట్లాడుతారు. అతడు చెప్పే విధానం నాకు బాగా నచ్చింది. అతడు తన మనసులో ఏది ఉంటే అదే చెప్తారు” అని వివరించింది.
సల్మాన్, పూజా కలిసి నటించిన తాజా చిత్రం'కిసీ కా భాయ్ కిసీ కా జాన్'. ఏప్రిల్ 21న సినిమా థియేటర్లలోకి రానుంది. వెంకటేష్ ఈ సినిమాలో పూజా అన్నయ్యగా నటిస్తున్నారు. దీంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు.