ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేదికపై తెలుగు సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. ‘RRR’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డును అందుకుంది. ఈ కేటగిరీలో అవార్డును పొందిన తొలి భారతీయ చిత్రంగా ‘RRR’ ఘనత సాధించింది. ఈ చిత్రానికి సంగీతం అందించిన ఎం ఎం కీరవాణి ఈ అవార్డును అందుకున్నారు. యావత్ దేశం ‘RRR’ టీమ్ కు అభినందనలు చెప్పింది. ప్రధాని మోడీ మొదలుకొని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న ‘RRR’.. ఆస్కార్స్ లోనూ సత్తా చాటాలని ఆకాంక్షించారు.


‘నాటు నాటు’ పాటపై విమర్శలు


ఓ వైపు ‘RRR’ టీమ్ పై దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తుండగా, మరికొంత మంది వ్యతిరేక ట్వీట్లతో వెగటు పుట్టిస్తున్నారు. ‘నాటు నాటు’ పాటపై చిల్లర కామెంట్స్ చేస్తున్నారు. ఇదేం పాట అంటూ వెకిలి నవ్వులు నవ్వుతున్నారు. ‘నాటు నాటు’ పాటతో పాటు సినిమాపైనా ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి సినిమాకు ప్రతిష్టాత్మక అవార్డులు రావడం ఏమిటంటూ వక్రబుద్ధిని బయట పెట్టుకుంటున్నారు. ఈ పిచ్చి వ్యాఖ్యలపై పలువురు సెలబ్రిటీలు ఘాటుగా స్పందిస్తున్నారు. ట్రోలర్స్ పిచ్చి మనస్థత్వంపై మండిపడుతున్నారు.


మీరు చిన్నప్పటి నుంచి ఇంతేనా?- అనిరుధ గుహ


“'నాటు నాటు’ పాట మామూలుగా ఉంది. ‘RRR’ సినిమా యావరేజ్‌ గా ఉంది. ఈ సినిమాలోని యాస మరింత దారుణంగా ఉందని కొందరు నవ్వుతున్నారు.  మీరు చిన్నప్పటి నుంచి ఇంతేనా? మరీ అంత బాధలో ఉన్నారా? కనీసం పక్కవారి సంతోషాన్ని ఓర్వలేని స్థితిలో ఉన్నారా? అంటూ రచయిత అనిరుధ గుహ ట్విటర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.






ఎదుటి వారి సంతోషాన్ని చూసి తట్టుకోలేరు కదా!- పూజా భట్


అటు ప్రముఖ దర్శకురాలు, నటి పూజా భట్ సైతం ట్రోలర్స్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఒకరి బాధను చూడగలరు. కానీ, ఎదుటి వారి సంతోషాన్ని చూసి తట్టుకోలేరు. ఇదే మానవ నైజం కదా!” అంటూ ట్వీట్ చేశారు.





మరికొంత మంది సెల్రబిటీలు సైతం ‘RRR’పై ట్రోలింగ్ పాల్పడుతున్న నెటిజన్లపై నిప్పులు చెరిగారు. కుళ్లు బుద్ధిని కలిగి ఉన్న వారిని మార్చడం కష్టం అంటూ కామెంట్స్ చేశారు.


Read Also: ‘RRR’ సీక్వెల్ పై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు, కీలక విషయాలు వెల్లడి!