Bigg Boss 18 Makers In Trouble: కింగ్ ఆఫ్ రియాలిటీ షోస్ బిగ్ బాస్ దేశ వ్యాప్తంగా ఓ రేంజ్ లో పాపులర్ అవుతోంది. ఇప్పటికే తెలుగు, తమిళ బిగ్ బాస్ షోలు ఆడియెన్స్ ను అలరిస్తుండగా, ఇప్పుడు హిందీలోనూ షో ప్రారంభం అయ్యింది. హిందీ బిగ్ బాస్ రియాలిటీ షో 18వ సీజన్ అక్టోబర్ 6 నుంచి ప్రారంభం అయ్యింది. మొత్తం 19 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు  షో హోస్ట్ సల్మాన్ ఖాన్. వీరిలో ఓ గాడిద కూడా ఉండటం విశేషం. ‘గధరాజ్’ అనే ముద్దుపేరుతో ఈ గాడిదను హౌస్ లోకి పంపించారు. మిగతా కంటెస్టెంట్లు అంతా దానితో ఫ్రెండ్లీగా ఉండాలని సల్మాన్ వారికి సూచించారు.


గాడిదను బయటకు పంపాలంటూ బిగ్ బాస్ నిర్వాహకులకు పెటా లేఖ


బిగ్ బాస్ హౌస్ లోకి గాడిదను కంటెస్టెంట్ గా తీసుకెళ్లడంపై పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ (PETA) ఇండియా ఆగ్రహం వ్యక్తం చేసింది. వినోదం కోసం మూగ జీవులను హింసించడం సరికాదని మండిపడింది.  ఈ మేరకు షో నిర్వాహకులతో పాటు సల్మాన్ ఖాన్ కు పెటా ప్రతినిధులు లేఖ రాశారు. "వినోదం పేరుతో జంతువులను హింసించకూడదు. వెంటనే సదరు గాడిదను హౌస్ నుంచి బయటకు పంపించాలి. యజమానికి దానిని అప్పజెప్పండి. బిగ్ బాస్ షోలో ఆ గాడిద చాలా ఒత్తిడికి గురవుతుంది. ప్రకృతికి విరుద్దంగా ఉన్న హౌస్ లో భయాందోళనకు గురవుతుంది. హౌస్ లోని లైట్లు, మ్యూజిక్ దానిని గందరగోళానికి గురి చేస్తున్నాయి. ప్రేక్షకుల వినోదం కోసం జంతువులను హింసించడం సరికాదు. వెంటనే ఆ గాడిదను వదిలేయడం మంచిది” అని లేఖలో వెల్లడించారు.


గాడిద పాలపై అవగాహన కోసమే…


అటు గాడిదను బిగ్ బాస్ హౌస్ లోకి పంపడం వెనుక వేరే ఉద్దేశం ఉందని మరికొంత మంది అంటున్నారు.  ప్రస్తుతం దేశంలో గాడిద పాలకు చాలా విలువ ఉంది. సౌందర్య సాధనాలతో పాటు మెడిసిన్స్ తయారీలో ఉపయోగిస్తున్నారు. గాడిద పాల ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యంతోనే హౌస్ లోకి తీసుకెళ్లినట్లు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.



తాజా ప్రోమోలో స్పెషల్ అట్రాక్షన్ మ్యాక్స్


లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ప్రోమోలో మ్యాక్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ షోలోకి రావాలని కోరినప్పుడు నర్వస్ అయ్యావా? అని అడిగితే గట్టిగా అరుస్తుంది. నర్వస్ కాలేదా? అనగానే తలూపుతూ ఓకే అన్నట్లు సమాధానం చెప్పింది. హౌస్ లో మంచి కంటెస్టెంట్ గా ఉండాలని చెప్పారు సల్మాన్. మంచిగా టాస్కులు ఆడటంతో పాటు ఎవ్వరు ఏమన్నా ఏడ్వకూడదని చెప్పాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అటు గాడిదను గార్డెన్ ఏరియాలో ఓ చిన్న ప్రదేశంలో ఉంచడాన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. నిర్వాహకులు దాన్ని వెంటనే బయటకు పంపించాలని కోరుతున్నారు. మూగజీవిని హింసించడం సరికాదంటున్నారు.  






Read Also: అమితాబ్ ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ అయితే రజనీది లాస్ట్ బెంచ్ ‌- వేట్టయన్ దర్శకుడి సెన్సేషనల్ కామెంట్స్