Telangana Scrap Policy: తెలంగాణలో 15 ఏళ్లు దాటిన వాహనాలను స్వచ్ఛందంగా స్కాపింగ్ చేసుకుంటే రాయితీలు ఇస్తామన్న ప్రభుత్వం అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా స్క్రాప్డ్ వాహనాలను గుర్తించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు టెస్టింగ్ సెంటర్లు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. సారథి, వాహన్​ పోర్టల్‌‌‌‌‌‌‌‌లో చేరిన రాష్ట్రప్రభుత్వం స్కాప్ పాలసీలో మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.  


వాహనాలు చెకింగ్ కోసం ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్లు అందుబాటులోకి తీసుకురానుంది తెలంగాణ ప్రభుత్వం. దీనిపై ఇప్పటికే కేంద్రంలో సంప్రదింపులు జరపుతోంది. రాష్ట్రంలో 37 కొత్త టెస్టింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే చర్యలకు ఉపక్రమిస్తోంది. ఒక్క హైదరాబాద్‌లో నాలుగు ఏర్పాటు చేస్తారు మిగతా 33 సెంటర్‌లను జిల్లాల్లో సిద్ధం చేస్తారు. ఈ సెంటరు ఒక్కొక్కటి ఏర్పాటుకు 8 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. 


15 ఏళ్లు దాటిన వాహనాలను కచ్చితంగా స్క్రాప్ చేయాలనే రూల్ ఏమీ లేదని ప్రభుత్వం నుంచి వస్తున్న సమాచారం. వాహనదారులు ఇష్టపూర్వకంగానే చేసుకోవచ్చట. అలాంటి వెహికల్స్‌ మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే మాత్రం అదనంగా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. దీన్ని గ్రీన్ ట్యాక్స్ పేరుతో వసూలు చేస్తారు. 


టూవీలర్స్‌ను తుక్కుగా మారిస్తే లైఫ్‌ ట్యాక్స్‌లో కనీసం వెయ్యి నుంచి ఆరేడు వేల వరకు రాయితీ పొంద వచ్చు. ఫోర్‌ వీలర్స్‌ అయితే 15 వేల నుంచి 50 వేల వరకు సబ్సిడీ వస్తుంది. కాలుష్య నియంత్రించేందుకు కేంద్రం ఈ స్క్రాప్ పాలసీ తీసుకొచ్చింది. ఇప్పటికే దీన్ని ఏపీ, గుజరాత్, యూపీ, కర్ణాటక రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా అందులో చేరింది. 


ఎవరైనా వ్యక్తి తన బండిని 17 ఏళ్లుగా నడుపుతుంటే ఆ రెండేళ్లకు గ్రీన్‌ ట్యాక్స్‌ చెల్లించాలి. చెల్లింపు ఆలస్యమైతే ఫైన్ కూడా పడుతుంది. అదే ఆ బండి స్క్రాప్ చేస్తే రెండేళ్ల ట్యాక్స్ బెనిఫిట్‌ ఇస్తారు. జరిమానా నుంచి మినహాయింపు లభిస్తుంది. ఉదాహరణకు రూ.10 లక్షల కారు కొంటే రూ.1.30 లక్షలు లైఫ్‌ ట్యాక్స్ చెల్లించాలి. మీ వెహికల్‌ను స్క్రాప్ చేస్తే వచ్చే రాయితీ ఇందులో తగ్గిస్తారు. రాయితీ రూ.50 వేలు అనుకుంటే రూ.11.30 లక్షల నుంచి 50వేలు మినహాయించుకొని చెల్లించాల్సి ఉంటుంది. స్క్రాప్ సెంటర్‌కు వెళ్లి వాహనం ఇస్తే వాళ్లు ఓ సర్టిఫికేట్ ఇస్తారు. దానిని కొత్త వెహికల్ కొనేటప్పుడు చూపిస్తే రాయితీ వస్తుంది.