‘నారప్ప’ తర్వాత శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న సినిమా ‘పెద కాపు 1’. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం వంటి సాఫ్ట్ సినిమాలు తెరకెక్కించిన శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన వయొలెంట్ సినిమా ఇదే. ఈ సినిమా ద్వారా విరాట్ కర్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు. ‘పెద కాపు 1’ టీజర్‌ను నిర్మాతలు విడుదల చేశారు.


టీజర్‌లో ఏం ఉంది?
సీనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఇచ్చిన స్పీచ్ బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తుండగా టీజర్ ప్రారంభం అవుతుంది. దీన్ని బట్టి ఇది 80ల్లో సాగే కథ అనుకోవచ్చు. అడవిలో పెద్ద చెట్టును నరికి యువకులు దాన్ని మోసుకురావడం, కొంతమందిని ప్రాణాలతోనే ఊరి మధ్యలో పాతి పెట్టడం వంటి సన్నివేశాలను చూపించారు. టీజర్‌లో నాగబాబు, రావు రమేష్, ఈశ్వరి రావు, అనసూయ వంటి భారీ స్టార్ క్యాస్టింగ్‌ను టీజర్‌లో చూపించారు. చాలా వయొలెంట్ సన్నివేశాలు కూడా టీజర్‌లో ఉన్నాయి. టీజర్ ఆఖర్లో హీరో తన తండ్రి గురించి చెబుతుండగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలని చూపిస్తారు. ఆయన కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు.



'అఖండ' లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన మిర్యాల రవీందర్ రెడ్డి 'పెదకాపు 1' సినిమాని నిర్మిస్తున్నారు. దీనికి సీక్వెల్స్ కూడా ఉన్నాయి అనుకోవచ్చు. ఇటీవలే ఈ సినిమా టైటిల్ ఫస్ట్ పోస్టర్ని మూవీ టీం విడుదల చేసింది. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మేనల్లుడు విరాట్ కర్ణ ఈ సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయం అవుతున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఇంటెన్స్ గా కనిపిస్తోంది. పోరాటానికి సిద్ధమవుతున్న యువకుడిగా విరాట్ కర్ణ పోస్టర్లో గుబురు గడ్డంతో కనిపించాడు. ఇక ఈ పోస్టర్ పై ‘ఓ సామాన్యుడి సంతకం’ అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది.


ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల కులం పేరుతో 'పెదకాపు' అనే టైటిల్ ని పెట్టడంతో టైటిల్ విషయంలో ఏవైనా వివాదం అవుతుందా అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడూ సాఫ్ట్ చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల నుండి రాబోతున్న ఓ విభిన్నమైన ప్రయత్నం గా ఈ 'పెదకాపు 1' సినిమా గురించి చెప్పుకోవచ్చు. మిర్యాల సత్యనారాయణ సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా, ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ ఫైట్స్ కంపోస్ట్ చేస్తున్నారు. చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.