బిగ్‌బాస్ నాన్‌స్టాప్ చివరి దశకు చేరుకుంది. ఆదివారం సాయంత్రానికి తెలుగు ఓటీటీ తొలి విన్నర్ ఎవరో తేలిపోనుంది. ఈలోపే అనేక అంచనాలు, అనధికరిక సర్వేలు జరుగుతున్నాయి. హౌస్‌లో ఉన్న వారిలో అఖిల్ - బిందు మాధవి మధ్యే ప్రధాన పోరు స్పష్టంగా కనిపిస్తోంది. వీరిద్దరి మధ్య ఓట్ల తేడా కూడా చాలా స్వల్పంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఓరోజు అఖిల్ టాప్ లో ఉంటే మరో రోజు బిందు మాధవి పుంజుకుంటోంది. గత సీజన్లన్నింటిలోనూ విన్నర్ ఎవరో స్పష్టంగా ప్రేక్షకులు ఊహించగలిగారు కానీ ఈసారి మాత్రం అంచనా వేయడం కష్టంగా మారింది. అఖిల్ -బిందుల మధ్య చాలా టఫ్ ఫైట్ కొనసాగుతోంది.


పాయల్ మద్దతు
బిందు మాధవికి మరో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తన మద్దతును ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా ‘నువ్వు టైటిల్ అందుకునేందుకు అర్హురాలివి’ అని కామెంట్ పెట్టింది. దీన్ని చూసి ఆమె అభిమానులు బిందు మాధవికి ఓట్లేసే అవకాశం ఉంది. పాయల్ రాజ్ పుత్ మాత్రమే కాదు, కొన్ని రోజుల క్రితం వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా బిందు మాధవికి మద్దుతుగా స్టేజ్ మీదకు వచ్చింది. అయితే బిందుకు తెలుగులో అంతకుముందు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. అఖిల్ బిగ్ బాస్ 4లో రన్నరప్ గా నిలిచాడు. అప్పట్నించి అతడికి కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ కొనసాగుతోంది. బిందుమాధవి ఈ షో ద్వారానే అభిమానులను సంపాదించుకుంది. 




అప్పుడు అభి ఇప్పుడు బిందు 
అఖిల్‌కు బిగ్‌బాస్ 4లో అభిజిత్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. అభిజిత్ ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు అఖిల్ తలొగ్గక తప్పలేదు. ఈసారైనా బిగ్ బాస్ ట్రోఫీ ఎత్తుదామన్న అతని కలకు బిందు మాధవి అడ్డుపడేలా ఉంది. కారణం బిందు అభిజిత్ లాగే మైండ్ గేమ్ ఆడుతోంది. మాట్లాడే పద్దతి, ఒంటరిగా సమస్యలను ఎదుర్కొనే సమర్థత అందరినీ ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా హౌస్ లో ఉన్నవారిలో ఇద్దరూ ముగ్గురూ తప్ప అందరూ ఆమెను ఏదో ఒక విషయంలో టార్గెట్ చేసి హైలైట్ చేశారు. అందువల్లే ప్రేక్షకులకు బిందుపై సింపథీ కూడా కలిగింది. ముఖ్యంగా నటరాజ్ మాస్టర్ బిందును అన్న మాటలు ఆయనపై కోపాన్నే కాదు బిందుకి సింపథీనితెచ్చిపెట్టాయి. ఇంతవరకు ఒక ఆడపిల్ల కూడా ట్రోఫీని గెలవలేదు. శ్రీముఖి రన్నరప్ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ సెంటిమెంట్ తో బిందుకు ట్రోఫీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 


Also read: చంద్రుని మట్టిలో ఆకుకూరల పెంపకం, భవిష్యత్తులో అక్కడ కూడా పంటలు పండిస్తామా?


Also read: వేల తేనెటీగల కష్టమే మనం తాగే స్పూను తేనె, నేడు తేనెటీగల దినోత్సవం